DA Hike : 1.2 కోట్ల మంది ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం దీపావళి కానుక
కేంద్రం ప్రభుత్వం దీపావళి కానుక
DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పండుగల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఊరట లభించింది. జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండే డీఏను 3 శాతం పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ప్రస్తుతం 55 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 58 శాతానికి పెరిగింది. ఈ మేరకు అక్టోబర్ 1న కేంద్ర మంత్రి డాక్టర్ అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. వారికి ఇది దీపావళి పండుగ కానుకగా భావించవచ్చు. ఈ 3 శాతం డీఏ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా సుమారు 10,084 కోట్ల రూపాయల భారం పడనుంది. అయినప్పటికీ, ఉద్యోగుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ అనేది వారి బేసిక్ సాలరీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్యోగి బేసిక్ సాలరీ రూ.50,000 అనుకుంటే, 3 శాతం డీఏ పెంపు అంటే రూ.1,500 అదనంగా జీతంలోకి వస్తుంది. అదే బేసిక్ సాలరీ రూ.60,000 ఉంటే, ప్రతి నెల రూ.1,800 పెరుగుదల ఉంటుంది.
రూ.50,000 బేసిక్ సాలరీ ఉన్నవారికి, గతంలో 55 శాతం డీఏ (రూ.27,500) లభించేది. ఇప్పుడు అది 58 శాతం డీఏ (రూ.29,000)కి పెరిగింది, అంటే ప్రతి నెలా రూ.1,500 అదనంగా లభిస్తుంది. డీఏ పెంపునకు ఇప్పుడు ఆమోదం లభించినప్పటికీ, ఇది జూలై నెల నుండే అమలులోకి వస్తుంది.అంటే, ఉద్యోగులకు అక్టోబర్ నెలలో చేతికి అందే జీతంలో ఈ 3 శాతం పెంపుతో పాటు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ కూడా కలిపి ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద మొత్తంలో సహాయపడుతుంది.