Credit Score : జీతం పెరిగితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా ? అసలు దీనిని ఎలా లెక్కిస్తారో తెలుసా ?
అసలు దీనిని ఎలా లెక్కిస్తారో తెలుసా ?;
Credit Score : ఈ రోజుల్లో క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. చాలామంది 'నాకు ఎక్కువ జీతం వస్తుంది కదా, నా క్రెడిట్ స్కోర్ కూడా ఎక్కువే ఉంటుంది' అని తప్పుగా అనుకుంటారు. కానీ, నిజానికి, ఎక్కువ జీతానికి క్రెడిట్ స్కోర్‌కు పెద్దగా నేరుగా సంబంధం లేదు. క్రెడిట్ స్కోర్ అనేది వేరే విధంగా పనిచేస్తుంది. దాని లెక్క కూడా వేరేలా ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ అంటే మీరు లోన్లను ఎలా తిరిగి కడుతున్నారు అని చెప్పే ఒక కొలమానం. ఇది 300 నుంచి 900 స్కోర్ వరకు ఉంటుంది. 300 అంటే చాలా తక్కువ స్కోర్ (పూర్), 900 అంటే సూపర్ స్కోర్ (వెరీ గుడ్). ఇక్కడ అప్పులు అంటే పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు. అలాగే, క్రెడిట్ కార్డు వాడకం కూడా ఒక రకమైన అప్పు కిందకే వస్తుంది.
మంచి క్రెడిట్ స్కోర్ ఎలా పొందాలి?
మీరు మంచి క్రెడిట్ స్కోర్ పొందాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి:
సకాలంలో బిల్లులు కట్టాలి: మీరు తీసుకున్న అప్పుల వాయిదాలను సరైన సమయానికి కట్టాలి. క్రెడిట్ కార్డు బిల్లులను కూడా గడువులోగా కట్టేయాలి.
కార్డును తక్కువగా వాడాలి: క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత ఉందో, అందులో తక్కువగా వాడటానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, లక్ష రూపాయల లిమిట్ ఉంటే, అందులో 30 వేల రూపాయలకు మించి వాడకపోవడం మంచిది.
మొత్తం బిల్లు కట్టండి: కొందరు బిల్లులో కనీస బ్యాలెన్స్ మాత్రమే కట్టి, మిగిలినది తర్వాత కడదాం అనుకుంటారు. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానేయండి. కనీస బ్యాలెన్స్ కట్టడం వల్ల వడ్డీ భారం పెరుగుతుంది. మొత్తం బిల్లును ఒకేసారి కట్టడం ఉత్తమం. ఇది మీ స్కోర్‌ను పెంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది.
ఈ విషయాలన్నీ పాటిస్తే, మీ క్రెడిట్ స్కోర్ కనీసం 700 మార్కుల దాకా పెరుగుతుంది. 750 పైన ఉంటే లోన్లు చాలా సులభంగా వస్తాయి.
ఎక్కువ జీతం ఉంటే క్రెడిట్ స్కోర్‌కు అసలు ఉపయోగం లేదా?
ఎక్కువ జీతం ఉన్నప్పుడు మీకు ఆర్థికంగా కాస్త భద్రత ఉంటుంది. అప్పులను సకాలంలో కట్టడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అంటే, ఎక్కువ జీతం ఉండటం వల్ల మీరు అప్పులను సరిగ్గా మేనేజ్ చేసుకోవచ్చు, దీనివల్ల పరోక్షంగా మీ క్రెడిట్ స్కోర్ పెరగొచ్చు. కానీ, మీ జీతం ఎంత ఎక్కువ ఉన్నా, మీరు ఆర్థికంగా క్రమశిక్షణతో లేకపోతే, అప్పులు సరిగ్గా కట్టకపోతే, మీ క్రెడిట్ స్కోర్ అస్సలు పెరగదు. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.