Donald Trump : కెనడాపై డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ బాంబ్.. ఏకంగా 50% దిగుమతి సుంకం విధింపు
ఏకంగా 50% దిగుమతి సుంకం విధింపు
Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రెజిల్ తర్వాత ఇప్పుడు కెనడాను లక్ష్యంగా చేసుకుంటూ ఆ దేశం నుంచి దిగుమతయ్యే మెజారిటీ వస్తువులపై ఏకంగా 50 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్ కార్లు, మద్యం మరియు డెయిరీ ఉత్పత్తుల పట్ల కెనడా ప్రభుత్వం వివక్ష చూపుతోందని, తమ మార్కెట్లకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 19 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
చట్టంలోని సెక్షన్ 338 ప్రయోగం
ట్రంప్ 1930 నాటి అమెరికన్ ట్రేడ్ యాక్ట్‌లోని అత్యంత శక్తివంతమైన సెక్షన్ 338ను ఉపయోగిస్తూ మూడు ప్రధాన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అయితే ఈ భారీ పన్ను బాదుడు నుంచి కెనడా ఇంధన ఉత్పత్తులు, పొటాష్, చేపలు, అత్యంత అవసరమైన ఖనిజాలకు మినహాయింపునిచ్చారు. ఇదివరకు USMCA ఒప్పందం కింద పన్ను మినహాయింపులు పొందిన వస్తువులపై కూడా ఈసారి 50 శాతం టారిఫ్ వర్తిస్తుందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఒప్పందం గడువు రాబోయే 30 రోజుల్లో ముగుస్తుండటంతో, చర్చలకు ఇంకా సమయం ఉందనే సంకేతాలను కూడా ట్రంప్ వర్గాలు ఇచ్చాయి.
కెనడా ఘాటు హెచ్చరికలు
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై కెనడా వ్యాపార వర్గాలు, నాయకులు మండిపడుతున్నారు. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ స్పందిస్తూ.. అమెరికా పన్నులు విధిస్తే కెనడా కూడా ప్రతిగా పన్నుల దాడికి దిగక తప్పదని హెచ్చరించారు. ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఇరు దేశాల్లోనూ ద్రవ్యోల్బణం (ఆల్రెడీ పెరుగుతున్న ధరలు) మరింత పెరిగే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్లు, మద్యం, డెయిరీ విక్రయాల్లో కెనడా అనుసరిస్తున్న విధానాలపై ట్రంప్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.