Donald Trump : భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తుందా ? ట్రంప్ ఆరోపణల్లో నిజమెంత ?
ట్రంప్ ఆరోపణల్లో నిజమెంత ?;
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరచుగా భారత్‌పై ఒక ఆరోపణ చేస్తుంటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశమని, భారత ప్రభుత్వం తమ వస్తువులపై భారీ పన్నులు వేస్తోందని ఆయన చెబుతూ ఉంటారు. అయితే, ట్రంప్ ఆరోపణలు నిజమా? దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నిజానికి, అమెరికా నుంచి భారత్‌కు వచ్చే వస్తువులపై మన దేశం సుంకాలు విధిస్తుంది. అయితే, ట్రంప్ చెబుతున్నంత భారీ స్థాయిలో ఈ సుంకాలు లేవు. భారత్ విధించే సగటు సుంకం 4.6% మాత్రమే. యూరోపియన్ యూనియన్ (5%), వియత్నాం (5.1%), ఇండోనేషియా (5.7%), బంగ్లాదేశ్ (10.6%) వంటి దేశాలు కూడా దాదాపు అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయి. అంటే, భారత్ ఒక్కటే అత్యధిక సుంకాలు విధిస్తుందన్న ట్రంప్ మాట నిజం కాదు.
అమెరికా నుంచి భారత్‌కు వచ్చే వస్తువులలో 45% వస్తువులపై 5% కంటే తక్కువ సుంకం ఉంటుంది. చాలా వస్తువులపై 10% కంటే తక్కువ సుంకాలు ఉన్నాయి. ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, పారిశ్రామిక యంత్రాలు, మందులు వంటి వాటిపై చాలా తక్కువ సుంకం ఉంది. ఫార్మా ఉత్పత్తులపై 0 నుంచి 7.5% వరకు, బొగ్గుపై 5%, విమాన విడిభాగాలపై 2.50%, ఎరువులపై 7.5 నుంచి 10% వరకు భారత్ సుంకాలు విధిస్తోంది.
గత 30-35 సంవత్సరాలలో భారత్ విధించే సుంకాలు భారీగా తగ్గాయి. 1990లో భారత్ 56% సుంకం విధించేది, కానీ ఇప్పుడు అది 4.6% కి పడిపోయింది. దీనిని బట్టి భారత్ ఒక స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని ప్రోత్సహిస్తోందని అర్థమవుతుంది. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ, పాల ఉత్పత్తులపై భారత్ 33% సుంకం విధిస్తుంది. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ సుంకం ఎక్కువగా ఉంటుంది. జపాన్, దక్షిణ కొరియా వంటి అనేక దేశాలు కూడా తమ రైతులను రక్షించుకోవడానికి వ్యవసాయ ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు విధిస్తాయి. ట్రంప్ కేవలం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శించడం వెనుక ఇతర రాజకీయ ఉద్దేశాలు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.