Post Office : అక్షరాలా 22 లక్షల కోట్లు..38 కోట్ల మంది నమ్మకం..పోస్టాఫీసుపై భారతీయుల అచంచల విశ్వాసం
పోస్టాఫీసుపై భారతీయుల అచంచల విశ్వాసం
Post Office : భారతదేశంలో పోస్టాఫీసు అంటే కేవలం ఉత్తరాలు చేరవేసే కేంద్రం మాత్రమే కాదు, అది కోట్ల మంది భారతీయుల నమ్మకానికి నిలువుటద్దం. మారుమూల గ్రామం నుంచి మహానగరం వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్ ఇప్పుడు ఒక భారీ బ్యాంకింగ్ దిగ్గజంగా అవతరించింది. తాజా గణాంకాల ప్రకారం..దేశవ్యాప్తంగా పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల్లో ప్రజలు దాచుకున్న మొత్తం ఏకంగా 22 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటంతో సామాన్యులు తమ కష్టార్జితాన్ని దాచుకోవడానికి పోస్టాఫీసునే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం దేశంలో సుమారు 38 కోట్ల యాక్టివ్ సేవింగ్స్ ఖాతాలు ఉండటం పోస్టాఫీసుపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ముఖ్యంగా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పథకం కింద ఇప్పటివరకు 3.8 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా, అందులో 2.27 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. తమ కుమార్తెల ఉన్నత చదువులు, వివాహాల కోసం తల్లిదండ్రులు ఈ సురక్షిత పెట్టుబడి మార్గాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు.
సాంకేతికత పరంగా కూడా పోస్టాఫీసులు ఇప్పుడు హైటెక్ హంగులు అద్దుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షల పోస్టాఫీసుల్లో కన్వేయర్ సిస్టమ్స్, ఆర్‌ఎఫ్‌ఐడీ , బార్‌కోడ్, క్యూఆర్ కోడ్ వంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. కొండ ప్రాంతాలు, చేరుకోలేని మారుమూల గ్రామాల్లో పోస్టల్ డెలివరీని వేగవంతం చేసేందుకు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో త్వరలో డ్రోన్ల ద్వారా డెలివరీ ప్రారంభించనున్నారు. నిరంతర పర్యవేక్షణ కారణంగా లావాదేవీలు లేని పోస్టాఫీసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.
అయితే ఇంతటి భారీ నెట్‌వర్క్, నమ్మకం ఉన్నప్పటికీ, పోస్టల్ శాఖ ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపిన వివరాల ప్రకారం.. పోస్టల్ శాఖ వార్షిక ఖర్చు దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఉండగా, ఆదాయం మాత్రం కేవలం 13,000 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది. ఖర్చుకు, ఆదాయానికి మధ్య ఉన్న ఈ భారీ అంతరం అతిపెద్ద సవాలుగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో ఆదాయం కంటే ఖర్చు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ సేవల నాణ్యత పెంచి ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.