EPFO : పీఎఫ్ ఖాతా క్లోజ్ అయిందా? అందులో డబ్బులు ఆగిపోయాయా? చిటికెలో వెనక్కి తెచ్చుకోండిలా
చిటికెలో వెనక్కి తెచ్చుకోండిలా
EPFO : చాలామంది ఉద్యోగస్తులు తరచుగా కంపెనీలు మారినప్పుడు లేదా రిటైర్మెంట్ తర్వాత తమ పాత పీఎఫ్ ఖాతాల గురించి పట్టించుకోవడం మానేస్తారు. కాలక్రమేణా ఆ ఖాతాలు ఇన్-ఆపరేటివ్ అంటే డియాక్టివ్ అయిపోతాయి. అందులో దాచుకున్న కష్టార్జితం అలాగే ఉండిపోతుంది. పైగా ఆ డబ్బు తనంతట తానుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుందని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా మీ పీఎఫ్ ఖాతాలో రూ.1,000 కంటే ఎక్కువ సొమ్ము ఉంటే, దానిని వెనక్కి తీసుకోవడానికి మీరే స్వయంగా రంగంలోకి దిగాలి. మరి ఆ నిలిచిపోయిన డబ్బును సులభంగా ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఏదైనా పీఎఫ్ ఖాతాలో వరుసగా 36 నెలల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోతే, అంటే కొత్తగా డబ్బు జమ కాకపోయినా లేదా విత్‌డ్రా చేయకపోయినా దానిని నిష్క్రియ ఖాతాగా పరిగణిస్తారు. రిటైర్ అయిన తర్వాత కూడా మూడేళ్ల వరకు మీరు ఆ డబ్బును తీసుకోకపోయినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి ఖాతాలపై వడ్డీ రావడం ఆగిపోయే ప్రమాదం ఉంది, దీనివల్ల దీర్ఘకాలంలో మీకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మీ పాత కంపెనీల యూఏఎన్ నంబర్లను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాల విషయంలో ప్రభుత్వం నేరుగా బ్యాంక్ అకౌంట్లకు పంపే ప్రక్రియను చేపట్టినప్పటికీ, అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్నవారికి ఆ సదుపాయం లేదు. మీ ఖాతాలో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉంటే, మొదట మీరు ఆ ఖాతాను యాక్టివేట్ చేయాలి. ఖాతా యాక్టివ్‌గా లేకపోతే మీరు పెట్టే క్లెయిమ్‌లను ఈపీఎఫ్ఓ ఆమోదించదు. అందుకే మెుదట మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ప్రాథమిక అవసరం.
డబ్బు విత్‌డ్రా చేసే ముందు మీ యూఏఎన్ నంబర్ పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. అలాగే కేవైసీ అంటే ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు పక్కాగా లింక్ అయి ఉండాలి. ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోతే ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుంది. మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ వివరాలన్నీ వెరిఫై అయ్యాయో లేదో సరిచూసుకోండి. ఆ తర్వాత నిష్క్రియ ఖాతాను పునరుద్ధరించాలని పోర్టల్‌లోని హెల్ప్ సెక్షన్ ద్వారా రిక్వెస్ట్ పంపాలి. మీ పాత యాజమాన్యం, అధికారులు దీనిని పరిశీలించి ఆమోదిస్తారు.
ఒక్కసారి అకౌంట్ యాక్టివేట్ అయ్యాక, ఆన్‌లైన్ ద్వారానే మీరు క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. మీరు పూర్తిగా ఉద్యోగం మానేసి ఉంటే ఫామ్ 19, పెన్షన్ డబ్బుల కోసం ఫామ్ 10C లేదా కొంత మొత్తం కావాలంటే ఫామ్ 31 ఎంచుకోవచ్చు. మీ బ్యాంక్ వివరాలు సరిగ్గా ఇచ్చి సబ్మిట్ చేస్తే, కొన్ని రోజుల్లోనే ఆ సొమ్ము నేరుగా మీ అకౌంట్‌లోకి చేరుతుంది. టెక్నికల్ కారణాల వల్ల ఆన్‌లైన్‌లో వీలుకాకపోతే, ఫామ్ 19 నింపి ఆధార్, పాన్ కాపీలతో పాటు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌ను సంబంధిత పీఎఫ్ ఆఫీసులో సమర్పించి ఆఫ్‌లైన్ ద్వారా కూడా డబ్బు పొందవచ్చు.
పీఎఫ్ అనేది మీ జీవితాంతం దాచుకున్న పొదుపు సొమ్ము. దానిని అలాగే వదిలేయడం ఏమాత్రం తెలివైన పని కాదు. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ అయ్యాయి కాబట్టి, కాస్త సమయం కేటాయించి మీ పాత ఖాతాలను వెతికి ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవడం లేదా ప్రస్తుత ఖాతాకు బదిలీ చేసుకోవడం ఉత్తమం.