LPG Price Hike : వంట గ్యాస్ విధ్వంసం.. బిర్యానీ ప్రియులకు షాక్.. హోటల్ రేట్లలో 20 శాతం భారీ బాదుడు
హోటల్ రేట్లలో 20 శాతం భారీ బాదుడు
LPG Price Hike : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ఇప్పుడు సామాన్యుడి భోజనంపై ప్రభావం చూపుతోంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చే ఘాటు ప్రకటనల వల్ల చమురు మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఈ ప్రభావంతో భారత్‌లో ఏప్రిల్ 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా సుమారు రూ. 200 పెరిగాయి. దీనివల్ల హోటల్ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో మీరు హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
హోటల్ యజమానుల ఆవేదన
వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలపై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా (HRAWI) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతిని నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇప్పుడు గ్యాస్ భారం కూడా తోడవడంతో హోటళ్ల నిర్వహణ వ్యయం 20 శాతం మేర పెరిగిందని అసోసియేషన్ ప్రతినిధి ప్రదీప్ శెట్టి తెలిపారు. వ్యాపారాలు తగ్గిపోవడం, పని గంటలు మారడం వంటి కారణాలతో ఇప్పటికే లాభాలు పడిపోయాయని, ఇప్పుడు ధరలు పెంచడం తప్ప తమకు మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఐదు నెలల్లో ఐదోసారి పెంపు
ఈ ఏడాది గ్యాస్ ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరుతోంది. గత నాలుగు నెలల్లోనే ఏకంగా ఐదుసార్లు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచారు. తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.195.5 పెరిగి రూ.2078.50కి చేరుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఢిల్లీలో సిలిండర్ ధర మొత్తం రూ.498 పెరగడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే సిలిండర్ ధర రూ.2200 మార్కును దాటే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వినియోగదారులపైనే భారం
హోటల్ యజమానులు తమ పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకునేందుకు మెనూ కార్డ్‌లలో రేట్లను సవరించే పనిలో పడ్డారు. టిఫిన్లు, భోజనం, కాఫీ, టీ వంటి ప్రతి వస్తువుపై 10 నుంచి 20 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి, ఇప్పుడు బయట తిండి కూడా భారంగా మారనుంది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు తొలగి, గ్యాస్ ధరలు తగ్గితే తప్ప ఈ మంట చల్లారేలా లేదు.