Reliance Communication : అనిల్ అంబానీ కార్యలయాల్లో ఈడీ సోదాలు
ముంబయ్, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ;
రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కి చెందిన ముంబయ్, ఢిల్లీ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు చేపట్టింది. రిలయన్స్ కమ్యూనికేషన్‌తో పాటు ఆ సంస్ధ అధినేత అనిల్ అంబానీలను ఫ్రాడ్ కేటగిరీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేర్చిన నేపథ్యంలో అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించడం విశేషం. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉండటంతో ఈడీ ఆయన ముంబయ్, ఢిల్లీ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. అనిల్ అంబానీ కంపెనీలకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లు, సెబీ, నేషనల్ పైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలతో పాటు పలు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సంస్ధల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈడీ సోదాలకు పూనుకుంది. దర్యాప్తులో భాగంగా అనిల్ అంబడానీ గ్రూప్ లో పనిచేస్తున్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా ఈడీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. అనిల్ అంబానీతో పాటు ఆయన ప్రమోటర్ గా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్ధను ఫ్రాడ్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 13వ తేదీన గుర్తించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోకసభలో ప్రకటించారు. అదే నెల 24వ తేదీన ఆర్‌బీఐకి కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫ్రాడ్ వర్గీకరణ గురించి సమాచారం ఇచ్చిందని కేంద్ర మంత్రి లోక్ సభ దృష్టికి తీసుకు వచ్చారు.