Mutual Fund : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి మొదలుపెడుతున్నారా? ఇలా పోర్ట్‌ఫోలియో ఉంటే లాభాలే లాభాలు
ఇలా పోర్ట్‌ఫోలియో ఉంటే లాభాలే లాభాలు
Mutual Fund : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఇప్పటివరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్‌డి వంటి సంప్రదాయ పథకాల్లోనే డబ్బులు దాచుకున్న వారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ అవగాహన లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి, ఆచితూచి అడుగు వేయడమే ఉత్తమం. కొత్త ఇన్వెస్టర్లకు అత్యంత సురక్షితమైన మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఒకేసారి లక్షల రూపాయలు మార్కెట్‌లో పెట్టే కంటే, ప్రతి నెల కొంత నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం వల్ల మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది. మార్కెట్ పడిపోయినప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి, పెరిగినప్పుడు లాభం వస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో సగటు ఖర్చు తగ్గి, మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది.
అసెట్ మిక్స్: ఎక్కడెక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలి?
పోర్ట్‌ఫోలియో అంటే మీ డబ్బును వేర్వేరు విభాగాల్లో పంపిణీ చేయడం. దీన్నే అసెట్ అలోకేషన్ అంటారు.
* ఇక్విటీ ఫండ్స్: మీరు యువకులు అయి ఉండి, 7 ఏళ్లకు పైగా సమయం ఉంటే ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు.
* డెట్ ఫండ్స్: రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారు బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే డెట్ ఫండ్స్ ఎంచుకోవచ్చు.
* బహుళ ఆస్తులు : బంగారం, ఇక్విటీ, డెట్ కలయికతో ఉండే ఫండ్స్ స్థిరత్వాన్ని ఇస్తాయి. మీ వయస్సు, ఆదాయం, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఈ మిశ్రమాన్ని ప్లాన్ చేసుకోవాలి.
మొదట ఏ ఫండ్స్ ఎంచుకోవాలి?
ప్రారంభంలో ఇండెక్స్ ఫండ్స్ లేదా డైవర్సిఫైడ్ ఇక్విటీ ఫండ్స్ మేలు. ఇండెక్స్ ఫండ్స్ అంటే నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ వంటి సూచీలను అనుసరిస్తాయి. ఇందులో ఫండ్ మేనేజర్ ప్రమేయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు కూడా తక్కువే. మొదట ఒక కోర్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి. అంటే దీర్ఘకాలం పాటు నమ్మకంగా ఉండే ఫండ్లను ఎంచుకోవాలి. అనుభవం పెరిగే కొద్దీ మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్లను మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు.
కేవలం ఇక్విటీ మాత్రమే కాదు
మ్యూచువల్ ఫండ్స్ అంటే కేవలం స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు. తక్కువ కాల వ్యవధిలో (ఉదాహరణకు 6 నెలల నుండి ఏడాది) డబ్బులు దాచుకోవాలనుకునే వారు లిక్విడ్ ఫండ్స్ లేదా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇవి సేవింగ్స్ అకౌంట్ కంటే మెరుగైన రిటర్న్స్ ఇస్తాయి. ముఖ్యంగా ట్యాక్స్ సేవింగ్ కోసం చూసే వారికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వరప్రసాదంలా పనిచేస్తాయి.
అతిగా ఆశపడొద్దు.. జాగ్రత్త
చాలా మంది కొత్త వారు భారీ రిటర్న్స్ చూసి స్మాల్ క్యాప్ లేదా ఏదైనా ఒక రంగం (సెక్టోరల్ ఫండ్స్) పై ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఉదాహరణకు ఐటీ లేదా ఫార్మా రంగం బాగా నడుస్తోంది కదా అని మొత్తం డబ్బు అక్కడే పెట్టేస్తారు. కానీ ఆ రంగం నష్టాల్లోకి వెళ్తే మీ పెట్టుబడి మొత్తం కరిగిపోతుంది. అందుకే డైవర్సిఫీకేషన్ ముఖ్యం. ఎప్పుడూ ఒకే సెక్టార్ పై ఆధారపడకుండా, మీ పెట్టుబడిని వివిధ రంగాలకు విస్తరింపజేయండి.