Anil Ambani : రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ;
విచారణకు హాజరు కావాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన కేసులో ఈ నెల 5వ తేదీన ఈడీ ముందు హాజరు కావలని అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు విషయమై గత వారం అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీలు అన్నింటిలో సోదాలునిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లతో పాటు, హార్డ్ డిస్క్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ తదుపరి విచారణకు అనిల్ అంబానీని తమ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించడం విశేషం. కంపెనీల్లో కోట్లాది రూపాయల అవకతవకలు చేయడటంతో పాటు మనీలాండరింగ్ కి పాల్పడటం, సుమారు రూ.3వేల కోట్ల మేరకు బ్యాంకు రుణాలు ఎగవేతకు సంబంధించిన అనిల్ అంబానీపై ఆరోపణలు రావడంతో జూలై 24వ తేదీ ముంబై, ఢిల్లీల్లో ఆయనకు చెందిన పలు కంపెనీలు, కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మూడు రోజుల పాటు ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీ కంపెనీల్లో పనిచేస్తున్న పలువురు ఎగ్జిక్యూటివ్‌లతో సహా ఇతర కంపెనీలకు చెందిన 50 మంది ప్రతినిధులను ఈడీ విచారణ చేసింది. ఈడీ సోదాలకు ముందు అనిల్ అంబానీకి చెందిన కంపెనీలపై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఎస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.3000 కోట్ల రుణాలను అనిల్ అంబానీ అక్రమంగా దారి మళ్ళించారనే అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది.