PF New Rules: కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న పీఎఫ్ వేతన పరిమితిని రూ.15,000 నుంచి ఏకంగా రూ.25,000కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17, 2026 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులు పీఎఫ్, పెన్షన్, అలాగే బీమా వంటి సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి రానున్నారు. అయితే ఈ మార్పు ఉద్యోగుల నెలవారీ జీతంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఏయే ఉద్యోగుల జీతంపై ప్రభావం పడుతుంది?

ఈ కొత్త నిబంధన వల్ల అందరి వేతనాలు మారవు కానీ, కొన్ని ప్రత్యేక వర్గాల ఉద్యోగులపై దీని ప్రభావం పడనుంది. ఎవరి బేసిక్ సాలరీ, కరవు భత్యం రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య ఉందో, వారు ఇప్పుడు తప్పనిసరి పీఎఫ్ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ వాటా కింద కొంత మొత్తం కట్ అవుతుంది. ఫలితంగా చేతికి వచ్చే టేక్-హోమ్ సాలరీ కొంత తగ్గే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల టేక్-హోమ్ వేతనం నెలకు సుమారు రూ. 1,200 వరకు తగ్గవచ్చు. ఒకవేళ కంపెనీ సీటీసీ పద్ధతిని బట్టి అదనపు పీఎఫ్ వాటాను కూడా సర్దుబాటు చేస్తే, ఈ కోత రూ. 2,400 వరకు ఉండే అవకాశం ఉంది.

చేతిలో డబ్బు తగ్గినా.. రిటైర్మెంట్ భద్రత పక్కా

మొదట చూసేందుకు నెలవారీ టేక్-హోమ్ సాలరీ తగ్గడం కొద్దిగా ఆందోళన కలిగించినప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చేతికి అందే డబ్బు కొద్దిగా తగ్గినప్పటికీ, మీ పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం భారీగా పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయానికి భారీ మొత్తంలో కార్పస్ నిధి తయారవుతుంది. అంతేకాకుండా, కొత్తగా ఈ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) మరియు ఉద్యోగుల డిపాజిట్లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) లాంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. గతంలో 2014 సెప్టెంబర్‌లో ఈ వేతన పరిమితిని రూ. 6,500 నుంచి రూ. 15,000కు పెంచగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు దీనిని రూ. 25,000కు సవరించడం గమనార్హం.

Tags: