Cooking Oil: వచ్చే పండుగల సీజన్‌కు ముందు దేశంలోని సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా వంట నూనెలు దిగుమతి మీద విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయం కనుక అమలైతే, పండగ వేళ వంట నూనెల ధరలు భారీగా తగ్గి ప్రజలకు పెద్దఎత్తున ఆర్థిక ఉపశమనం లభించనుంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ సమాచారం వెల్లడైంది.

భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

మన దేశంలో గత ఒక్క ఏడాది కాలంలోనే వివిధ రకాల వంట నూనెల ధరలు సుమారు 20 శాతం వరకు పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకునే దేశాలలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన దేశ ప్రజల అవసరాల కోసం కావలసిన నూనెలో దాదాపు మూడింట రెండు వంతుల భాగాన్ని విదేశాల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పామ్ ఆయిల్‌ను, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలను భారీగా దిగుమతి చేసుకుంటున్నాము.

పండుగ సీజన్ డిమాండ్

సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మన దేశంలో వరుసగా పండుగలు ప్రారంభమవుతాయి. ఈ పండుగ సీజన్‌లో ప్రతి ఇళ్లలోనూ రకరకాల పిండి వంటలు, స్వీట్లు, కారాలు, ఇతర వంటకాలు ఎక్కువగా తయారు చేస్తుంటారు. దీనివల్ల మార్కెట్లో నూనెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, సామాన్యులపై భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే కేవలం వినియోగదారుల ప్రయోజనాలే కాకుండా, దేశంలోని మన స్వదేశీ రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోనున్నారు.

రైతులకు నష్టం జరగకుండా సుంకం తగ్గింపు

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వం బేసిక్ ఇంపోర్ట్ డ్యూటీని సుమారు 5 శాతం వరకు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా పరిమితంగా సుంకం తగ్గించడం వల్ల మన దేశంలోని సోయాబీన్ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడవచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావం కూడా నూనెలపై ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పండుగలకు ముందు నూనె ధరలు తగ్గే అవకాశం ఉండటంతో గృహిణులు ఎంతో ఊరట చెందనున్నారు.

Tags: