EPFO 3.0 : రెండు అకౌంట్లు ఉంటే పీఎఫ్ సొమ్ము లాక్ అయినట్లే.. కొత్త కంపెనీకి వెళ్లే ముందే అలర్ట్
కొత్త కంపెనీకి వెళ్లే ముందే అలర్ట్
EPFO 3.0 : ఈ రోజుల్లో మంచి జీతం, బెటర్ కెరీర్ గ్రోత్ కోసం ఉద్యోగాలు మారడం చాలా సాధారణం అయిపోయింది. అయితే, కొత్త ఉద్యోగంలో చేరే సంతోషంలో చాలామంది తమ పాత కంపెనీకి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ (PF) బదిలీ విషయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్ల వల్ల కష్టపడి దాచుకున్న పీఎఫ్ సొమ్ము చాలా కాలం పాటు అటకెక్కిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థ ద్వారా పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ మునుపటి కంటే చాలా వేగంగా, పూర్తిగా పేపర్‌లెస్ పద్ధతిలో సాగనుంది. అయినప్పటికీ, మీ పర్సనల్ రికార్డులలో తప్పులు ఉంటే మాత్రం ఈ సరికొత్త డిజిటల్ సిస్టమ్ కూడా మీ పీఎఫ్ డబ్బులను బదిలీ చేయలేదు. అందుకే ఉద్యోగం మారే ముందే కొన్ని ముఖ్యమైన విషయాలను సరిచూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పర్సనల్ డిటైల్స్‌లో తేడాలు
పీఎఫ్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కు బదిలీ కావడంలో ఆలస్యం జరగడానికి ప్రధాన కారణం ఉద్యోగి వ్యక్తిగత వివరాలలో తప్పులు ఉండటమే. మీ పేరు, మీ తండ్రి పేరు, పుట్టిన తేదీ లేదా జెండర్ వంటి వివరాలు ఒక డాక్యుమెంట్‌లో ఉన్నట్టుగా ఇంకో డాక్యుమెంట్‌లో ఉండవు. ఉద్యోగం మారే ముందే మీ ఈపీఎఫ్ఓ రికార్డులు, గుర్తింపు కార్డులు, పాన్ కార్డ్ మరియు మీ బ్యాంక్ పాస్‌బుక్‌లలో ఉన్న వివరాలన్నీ ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వీటిలో ఏ ఒక్క అక్షరం లేదా నంబర్ తప్పుగా ఉన్నా సరే, ఆటోమేటిక్ సిస్టమ్ మీ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తుంది.
రెండో యూఏఎన్ క్రియేట్ చేస్తున్నారా?
చాలామంది ఉద్యోగులు చేసే అతిపెద్ద పొరపాటు.. కంపెనీ మారిన ప్రతిసారీ కొత్త యూఏఎన్ (Universal Account Number) నంబర్‌ను క్రియేట్ చేసుకోవడం. నిజానికి ఒక ఉద్యోగికి తన జీవితకాలంలో ఒకే ఒక్క యూఏఎన్ నంబర్ ఉండాలి. మీరు ఎన్ని కంపెనీలు మారినా అదే నంబర్‌ను కొత్త కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కొత్త కంపెనీ వారు మీ పేరు మీద పొరపాటున రెండో యూఏఎన్ నంబర్ క్రియేట్ చేస్తే, పాత పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులను కొత్త అకౌంట్‌లోకి మార్చడం చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే కొత్త ఆఫీస్‌లో జాయిన్ అయ్యే రోజే మీ పాత యూఏఎన్ నంబర్‌ను వారికి స్పష్టంగా అందించడం మర్చిపోవద్దు.
కేవైసీ (KYC) వెరిఫికేషన్: ముందే పూర్తి చేసుకోకపోతే మొదటికే మోసం!
మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ సజావుగా సాగాలంటే మీ యూఏఎన్ నంబర్‌కు కేవైసీ పూర్తి కావడం చాలా ముఖ్యం. మీ పీఎఫ్ ఖాతాకు మీ గుర్తింపు కార్డు, పాన్ కార్డ్ మరియు మీ ప్రస్తుత యాక్టివ్ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. అంతేకాకుండా అవన్నీ ఆన్‌లైన్‌లో వెరిఫై అయి ఉండటం తప్పనిసరి. కేవైసీ ప్రక్రియ పూర్తి కాకుండా లేదా ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్‌లో ఉంటే, ఈపీఎఫ్ఓ 3.0 సాఫ్ట్‌వేర్ మీ ట్రాన్స్‌ఫర్ అభ్యర్థనను ముందుకు పంపదు. కాబట్టి ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వెళ్లి మీ కేవైసీ స్టేటస్ ముందే చెక్ చేసుకోవడం మంచిది.
పాత బాస్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్‌డేట్ చేశారా?
ఈపీఎఫ్ఓ 3.0లో సరికొత్త టెక్నాలజీ వచ్చినప్పటికీ, పాత యాజమాన్యం పాత్ర ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. మీరు పాత కంపెనీలో ఉద్యోగం వదిలేసినప్పుడు, ఆ కంపెనీ వారు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని పక్కాగా అప్‌డేట్ చేయాలి. ఒకవేళ పాత కంపెనీ వారు ఈ వివరాలను నమోదు చేయకపోతే లేదా మీ జీతం రికార్డులలో ఏవైనా తప్పులు దొర్లితే మీ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ అక్కడే ఆగిపోతుంది. అందుకే రిలీవింగ్ లెటర్ తీసుకునే ముందే ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయ్యాయో లేదో మీ పాత హెచ్ఆర్ ని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి.
అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కొన్నిసార్లు లేట్ అవ్వొచ్చు
మీ వైపు నుండి డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఈపీఎఫ్ఓ సర్వర్లలో సాంకేతిక లోపాలు, సిస్టమ్ అప్‌గ్రేడ్లు లేదా ఒకేసారి ఎక్కువ మంది అప్లై చేసుకోవడం వల్ల ప్రాసెసింగ్‌కు కొంచెం టైమ్ పట్టవచ్చు. ఇలాంటి సమయాల్లో ఆందోళన చెందకుండా, ఈపీఎఫ్ఓ అధికారిక మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టేటస్‌ను క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈపీఎఫ్ఓ అధికారులు ఏదైనా అదనపు సమాచారం లేదా డాక్యుమెంట్లు అడిగితే, వెంటనే వాటిని ఆన్‌లైన్‌లో సమర్పించి మీ పీఎఫ్ సొమ్మును సేఫ్‌గా కొత్త అకౌంట్‌లోకి మార్చుకోవాలి.