EPFO 3.0 : ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. యూపీఐ సదుపాయం కూడా
యూపీఐ సదుపాయం కూడా
EPFO 3.0 : ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపికబురు అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన డిజిటల్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ EPFO 3.0 వెర్షన్‌ను తీసుకువస్తోంది. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. 2026 మధ్య నాటికి ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఏటీఎం కార్డుతో పీఎఫ్ సొమ్ము
ఈపీఎఫ్‌ఓ 3.0లో రాబోతున్న విప్లవాత్మక మార్పు ఏటీఎం విత్ డ్రాయల్. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బుల కోసం ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసి, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై పీఎఫ్ సభ్యులకు ప్రత్యేకంగా ఏటీఎం కార్డులు జారీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ కార్డులు నేరుగా మీ పీఎఫ్ ఖాతాతో అనుసంధానమై ఉంటాయి. అత్యవసర సమయంలో బ్యాంకుకు వెళ్లకుండానే మీకు కావాల్సిన డబ్బును ఏటీఎం సెంటర్ నుంచి తీసుకోవచ్చు. అంతేకాకుండా, గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, చిన్న మొత్తాలను విత్ డ్రా చేసుకోవడం సులభతరం కానుంది.
ఎంత డబ్బు తీసుకోవచ్చు? పరిమితులు ఏంటి?
ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవాలనుకునే వారికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. సభ్యులు తమ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్ములో గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే ఇలా తక్షణమే తీసుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన సగం డబ్బును రిటైర్మెంట్ అవసరాల కోసం భద్రంగా ఉంచాలని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది. దీనివల్ల సభ్యులకు తక్షణ ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు, భవిష్యత్తుకు కూడా భరోసా ఉంటుంది.
ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్‌తో నిమిషాల్లో పని
ఈ కొత్త వెర్షన్‌లో ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనే మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. గతంలో క్లెయిమ్ సెటిల్ కావడానికి రోజులు పట్టేది, కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా మీ వివరాలను వెరిఫై చేసి నిమిషాల్లో డబ్బును మీ ఖాతాలో జమ చేస్తుంది. ఇందుకోసం ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే 32 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల కంపెనీలు పీఎఫ్ సొమ్మును నేరుగా బ్యాంకుల్లో జమ చేయడం, సభ్యులకు క్లెయిమ్స్ వేగంగా అందడం సాధ్యమవుతుంది.
ఈ సేవలు పొందాలంటే ఏం చేయాలి?
మీరు కూడా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు పొందాలనుకుంటే కొన్ని పనులు ముందే పూర్తి చేయాలి. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఖచ్చితంగా యూఏఎన్ తో లింక్ అయి ఉండాలి. అలాగే మీ మొబైల్ నంబర్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఈ కేవైసీ వివరాలన్నీ పక్కాగా ఉంటేనే ఈపీఎఫ్‌ఓ 3.0 సేవలను మీరు ఎలాంటి ఆటంకం లేకుండా పొందగలరు.