EPFO: భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల భవిష్యత్తు అవసరాలకు నిధిగా ఉపయోగపడే ఈపీఎఫ్ఓ వ్యవస్థలో ఊహించని రీతిలో భారీ సొమ్ము మురిగిపోతోంది. ఉద్యోగంలో చేరిన ప్రతినెల యజమాని, ఉద్యోగి వాటా కింద జమ అయ్యే పిఎఫ్ నిధులను చాలామంది ఉద్యోగం మారినప్పుడు లేదా మానేసినప్పుడు విత్‌డ్రా చేసుకోవడం లేదు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఎవరూ దావా వేయని, క్లెయిమ్ చేయని సొమ్ము ఏకంగా రూ.8,000 కోట్లకు చేరుకుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. ఈ సమాచారం తెలిసిన ఉద్యోగులు తమ పాత పిఎఫ్ ఖాతాల పరిస్థితి ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు.

భారీగా పెరుగుతున్న ఇన్‌యాక్టివ్ ఖాతాలు

ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు పాత పిఎఫ్ ఖాతాను కొత్త ఖాతాలోకి బదిలీ చేయకపోవడం, ఉద్యోగం వదిలేశాక నిధులను డ్రా చేసుకోకపోవడం వల్ల ఇన్‌యాక్టివ్ ఖాతాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 11,72,923 గా ఉన్న ఇన్‌యాక్టివ్ ఖాతాల సంఖ్య 2022 నాటికి 13,41,848 కి చేరింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ పెరుగుదల మరింత వేగవంతమైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 17,44,518 కి పెరిగిన ఈ సంఖ్య, 2024 నాటికి ఏకంగా 21,55,387 ఖాతాలకు చేరుకుంది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో నిరుపయోగంగా ఉన్న పిఎఫ్ ఖాతాల సంఖ్య 84 శాతం పెరగడం గమనార్హం.

ప్రతి ఖాతాలోనూ భారీ నిధులు

కేవలం ఖాతాల సంఖ్య మాత్రమే కాకుండా, ఒక్కో ఇన్‌యాక్టివ్ ఖాతాలో పడి ఉన్న సగటు నిధుల పరిమాణం కూడా నిరంతరం పెరుగుతోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో అకౌంట్‌లో సగటున రూ.33,513 లభ్యంగా ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ మొత్తం రూ.39,460కి పెరిగింది. పిఎఫ్ ఖాతాదారులకు ప్రతి సంవత్సరం వడ్డీ తోడవ్వడం వల్ల ఈ నిధులు అలా పెరుగుతూనే ఉన్నాయి. తమ కష్టార్జితం ఖాతాల్లోనే ఉండిపోయిన విషయం చాలామందికి తెలియకపోవడం లేదా క్లెయిమ్ ప్రక్రియపై స్పష్టత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

మీ పాత పిఎఫ్ సొమ్మును తిరిగి పొందడం ఎలా?

ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత యూఏఎన్ నంబర్ ఆధారంగా కొత్త కంపెనీకి వివరాలు అందిస్తే నిధులు సులభంగా బదిలీ అవుతాయి. చాలా ఏళ్లుగా వాడకుండా వదిలేసిన పిఎఫ్ అకౌంట్లలో ఉన్న సొమ్మును క్లెయిమ్ చేయడానికి ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పిఎఫ్ ఖాతాలో సరైన వివరాలు, కేవైసీ అప్డేట్ చేసి ఉన్నట్లయితే నిమిషాల వ్యవధిలోనే పాత నిధులను ప్రస్తుత ఖాతాలోకి బదిలీ చేసుకోవడం లేదా నేరుగా బ్యాంకు ఖాతాకు విత్‌డ్రా చేసుకోవడం సాధ్యమవుతుంది.

Tags: