EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆగస్టు 5న పీఎఫ్‌ఓ సేవలు బంద్
పీఎఫ్‌ఓ సేవలు బంద్
EPFO : మీరు పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అలర్ట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ కోట్లాది మంది చందాదారులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. సిస్టమ్ అప్‌గ్రేడేషన్ పనుల కారణంగా ఆగస్టు 5, 2026 (బుధవారం) నాడు తమ ఈ-ఆఫీస్ అప్లికేషన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ప్రకటించింది. సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు (మొత్తం 3.5 గంటలు) ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా పనిచేయదు. కాబట్టి వినియోగదారులు తమ అత్యవసర పనులను ఈ సమయానికి ముందే లేదా ఆ తర్వాత పూర్తి చేసుకోవాలని సూచించింది.
ఎందుకీ అంతరాయం?.. సాంకేతిక కారణాలు ఇవే
ఈపీఎఫ్‌ఓ తన డిజిటల్ సేవలను మరింత వేగవంతం, సురక్షితం, నమ్మకమైనవిగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ఈ-ఆఫీస్ టీమ్ ప్లాట్‌ఫామ్‌లోని పలు విభాగాను అప్‌డేట్ చేయనుంది. ఈ 3.5 గంటల వ్యవధిలో ఈ-ఫైల్ (e-File), ఈ-పోర్టల్, ఎంఐఎస్ (MIS), ఎమ్‌డిఎమ్ (MDM) లకి సంబంధించి కొత్త వర్షన్లను ఇన్స్టాల్ చేయనున్నారు. భవిష్యత్తులో సేవలు మరింత సులువుగా సాగేందుకే ఈ నిలిపివేత అని సంస్థ వెల్లడించింది.
పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెసింగ్‌కు మరికొంత సమయం
గత జూన్ చివరి వారంలో ఎంప్లాయర్ పోర్టల్, ఉమంగ్ యాప్‌లలో పెద్ద ఎత్తున డేటాబేస్ మైగ్రేషన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్త సిస్టమ్ కింద సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. అయితే మోసాలను నివారించడానికి, భద్రతను పటిష్టం చేయడానికి ప్రతి క్లెయిమ్‌ను అదనపు తనిఖీల తర్వాతే పాస్ చేస్తున్నారు. దీనివల్ల రాబోయే కొన్ని రోజుల పాటు పీఎఫ్ క్లెయిమ్‌లు సెటిల్ అవ్వడానికి సాధారణం కంటే కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. రద్దీగా ఉండే సమయాల్లో పోర్టల్‌లో పదే పదే లాగిన్ అవ్వవద్దని ఈపీఎఫ్‌ఓ కోరింది.
ఉమంగ్ యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి!
సిస్టమ్ అప్‌గ్రేడేషన్ జరుగుతున్నప్పటికీ, ఉమంగ్ (UMANG) యాప్ ద్వారా కొన్ని అత్యవసర సేవలు సభ్యులకు అందుబాటులోనే ఉంటాయి.
* కొత్త యుఏఎన్ కేటాయింపు, దానిని యాక్టివేట్ చేసుకోవడం.
* ముందుగానే ఉన్న యుఏఎన్ ఖాతాకు ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవడం.
* కేవలం పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకునే వారు ఎస్‌ఎమ్‌ఎస్ లేదా మిస్డ్ కాల్ సౌకర్యం ద్వారా ఎప్పటిలాగే తమ వివరాలను తెలుసుకోవచ్చు.