EPFO Alert : ఇక టెన్షన్ అక్కర్లేదు..ఒక్క మిస్డ్ కాల్‌తో మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెల్సుకోండి

ఒక్క మిస్డ్ కాల్‌తో మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెల్సుకోండి

Update: 2025-12-17 06:32 GMT

EPFO Alert : ప్రతి ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ పేరుతో కొంత డబ్బు కట్ అవుతుంది. ఇది మన భవిష్యత్తు కోసం జమ అవుతోందని చాలామంది ఊపిరి పీల్చుకుంటారు. అయితే మీ జీతం నుంచి కట్ చేసిన డబ్బును మీ కంపెనీ నిజంగా ఈపీఎఫ్‌ఓ ఖాతాలో జమ చేసిందా లేదా అని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. సాంకేతిక లోపాలు లేదా కంపెనీ నిర్లక్ష్యం కారణంగా కొన్నిసార్లు ఈ డబ్బు మీ ఖాతాలో అప్‌డేట్ కాకపోవచ్చు. ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలో 12 శాతం ఉద్యోగి వాటాగా కట్ అవుతుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి ఖాతాలో జమ చేయాలి. కంపెనీ జమ చేసే 12 శాతం వాటాలో, 3.67 శాతం ఈపీఎఫ్‌ లో, మిగిలిన 8.33 శాతం ఈపీఎస్ (పెన్షన్ స్కీమ్)లో జమ అవుతుంది.

ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం, కంపెనీలు ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ కట్ చేసిన తర్వాత, దానిని 15 రోజుల్లోపు ఈపీఎఫ్‌ఓకు జమ చేయాలి. ఉదాహరణకు, మీకు నెల 1వ తేదీన జీతం వచ్చిందనుకుంటే, అదే నెల 15వ తేదీలోపు కంపెనీ మీ పీఎఫ్‌ను జమ చేయాల్సి ఉంటుంది. డబ్బు జమ అయిన తర్వాత, మీ ఆన్‌లైన్ పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ అప్‌డేట్ కావడానికి మరో కొద్ది రోజులు పట్టవచ్చు. కాబట్టి, జీతం వచ్చిన వెంటనే పీఎఫ్ అప్‌డేట్ అవ్వకపోతే కంగారు పడనవసరం లేదు. కానీ ఒకవేళ నెలలో 20-25 తేదీలు దాటినా మీ ఖాతాలో జమ కాకపోతే మాత్రం తప్పకుండా అప్రమత్తం కావాలి.

మీరు మీ పీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని క్లిక్‌లలో, ఇంట్లో కూర్చొని మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌లోని పాస్‌బుక్ సెక్షన్‌లోకి వెళ్లి, మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. అక్కడ మీ మెంబర్ ఐడీని ఎంచుకుంటే, మీ కంపెనీ, మీ వాటా జమ వివరాలు, అలాగే మొత్తం బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.

మొబైల్‌లో ప్రభుత్వ ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఈపీఎఫ్‌ఓ సర్వీసెస్‌లోకి వెళ్లి యూఏఎన్ ద్వారా లాగిన్ అయ్యి సులభంగా పాస్‌బుక్‌ను చూడవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేనివారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. అదే నంబర్‌కు EPFOHO UAN అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపినా వివరాలు తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News