EPFO: గుడ్ న్యూస్.. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.50,000 పరిహారం!
పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.50,000 పరిహారం!;
EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడు ఈపీఎఫ్ ఖాతా ఉన్న, ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, అతని కుటుంబానికి కనీసం రూ.50,000 పరిహారం లభిస్తుంది. దీనికి సంబంధించి EPFO ఒక కొత్త నిబంధనను సవరించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. పీఎఫ్ సభ్యుడు చనిపోయినప్పుడు, అతని పీఎఫ్ ఖాతాలో రూ.50,000 కంటే తక్కువ డబ్బు ఉన్నప్పటికీ తన కుటుంబానికి కనీసం రూ.50,000 పరిహారం లభిస్తుంది.
సింపుల్ గా చెప్పాలంటే, ఒక వ్యక్తి గత ఆరు నెలల నుండి ఉద్యోగంలో ఉండి ప్రతి నెలా అతని ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమ అవుతూ ఉంటే అతను మరణించినప్పుడు అతని కుటుంబానికి కనీసం రూ.50,000 పరిహారం అందుతుంది. అతని పీఎఫ్ ఖాతాలో రూ.50,000 కంటే తక్కువ డబ్బు ఉన్నప్పటికీ ఈ డబ్బులు అందిస్తుంది ప్రభుత్వం
పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి కనీసం 12 నెలలు నిరంతరం ఉద్యోగంలో ఉండాలి. అంటే, 12 నెలల పాటు క్రమం తప్పకుండా ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమ అవుతూ ఉండాలి. అంతేకాకుండా, ఈపీఎఫ్ ఖాతాలో కనీసం రూ.50,000 బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే రూ.50,000 పరిహారం ఇచ్చేవారు. కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగి ఒక ఉద్యోగం వదిలి 2 నెలలలోపు మరొక ఉద్యోగంలో చేరితే, అది నిరంతర ఉపాధిగా పరిగణించబడుతుంది. ఉద్యోగి కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత ఎప్పుడైనా మరణించినా, అతని కుటుంబానికి కనీసం రూ.50,000 పరిహారం లభిస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు ఆరు నెలలుగా ఎటువంటి డబ్బు జమ కాకపోయినా, కానీ అతను మరణించినప్పుడు ఇంకా ఉద్యోగాన్ని వదిలిపెట్టకపోతే, అప్పుడు కూడా కుటుంబానికి పరిహారం లభిస్తుంది. ఈ మార్పులు ఉద్యోగుల కుటుంబాలకు, ముఖ్యంగా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి, ఆర్థికంగా అండగా నిలుస్తాయి.