EPFO: అత్యవసర సమయంలో ఉద్యోగులకు కొండంత అండగా నిలిచే ఈపీఎఫ్ డబ్బుల విత్ డ్రా ప్రక్రియను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మరింత సులభతరం చేసింది. పాత 13 నిబంధనలను రద్దు చేసి కేవలం మూడు కేటగిరీలుగా కుదించింది. ఇప్పుడు ఉద్యోగులు ఒక సంవత్సరం సర్వీస్ పూర్తయితే చాలు తమ ఖాతా నుంచి 75 శాతం నిధులను వెంటనే పొందే అవకాశం లభించింది. గతంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే 13 రకాల నిబంధనలు, రకరకాల షరతులు ఉండేవి. ఆ సంక్లిష్ట విధానానికి స్వస్తి పలుకుతూ ఈపీఎఫ్ఓ మూడు స్పష్టమైన కేటగిరీలను తీసుకొచ్చింది. మొదటి విభాగానికి సంబంధించి తీవ్రమైన అనారోగ్యం, పిల్లల ఉన్నత చదువులు, వివాహ ఖర్చులకు అనుమతిస్తారు. రెండో కేటగిరీ కింద సొంత ఇల్లు కొనడం, నిర్మాణం లేదా హోమ్ లోన్ చెల్లింపులను చేర్చారు. మూడో విభాగానికి సంబంధించి ఎలాంటి నిర్దిష్ట కారణం చెప్పకుండానే మీ పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి 75 శాతం నిధులను నేరుగా డ్రా చేసుకోవచ్చు.

ఏడాది సర్వీస్ ఉంటే చాలు.. వడ్డీతో సహా నిధులు

పాత నిబంధనల ప్రకారం అడ్వాన్స్ విత్‌డ్రా కోసం కనీసం 3 నుంచి 7 ఏళ్ల సర్వీస్ తప్పనిసరిగా ఉండేది. ఈ సడలింపుల తర్వాత కనీస సర్వీస్ కాలాన్ని కేవలం 12 నెలలకు అంటే ఒక సంవత్సరానికి కుదించారు. మరో గొప్ప పరిణామం ఏంటంటే, గతంలో కేవలం ఉద్యోగి వాటా మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఉద్యోగి చందా, యాజమాన్యం చందాతో పాటు ఆ మొత్తానికి వచ్చిన వడ్డీ కూడా కలిపి లభిస్తుంది. దీనివల్ల అవసరంలో ఉన్న ఉద్యోగులకు చేతికి పెద్ద మొత్తంలో సొమ్ము అందుతుంది.

ఉద్యోగం పోతే వెంటనే 75 శాతం నగదు విత్‌డ్రా

ఏదైనా కారణంతో ఉద్యోగం ఊడిపోయినా లేదా రాజీనామా చేసినా ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పిస్తూ కొత్త రూల్స్ తెచ్చారు. నిరుద్యోగిగా మారిన వెంటనే ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతాన్ని ఒక్కసారిగా డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం సొమ్మును తీసుకోవడానికి వరుసగా 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉండాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాల రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

చదువు, పెళ్లిళ్లకు ఎన్నిసార్లు డ్రా చేసుకోవచ్చు?

వైద్య అత్యవసర పరిస్థితికి ఎలాంటి పరిమితి లేదు. అనారోగ్య చికిత్సల కోసం సభ్యులు తమ అవసరానికి తగినట్లుగా ఎన్నిసార్లు అయినా డబ్బులు తీసుకోవచ్చు. పిల్లల చదువుల విషయానికి వస్తే మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 10 సార్లు నిధులు తీసుకోవడానికి అనుమతిస్తారు. వివాహ ఖర్చుల కోసం 5 సార్లు అడ్వాన్స్ పొందే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 8.25 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఖాతాలో మిగిలే 25 శాతం డబ్బుపై ఈ మెరుగైన వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. 2026 జూలై 15న ప్రభుత్వం 34 కోట్లకు పైగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ సొమ్మును జమ చేసింది.

Tags: