ATM: ఒకప్పుడు అత్యవసర నగదు కోసం ప్రతీ వీధి చివర ఏటీఎమ్ సెంటర్ల ముందు పొడవైన క్యూలు కనిపించేవి. కానీ ఇప్పుడు డిజిటల్ విప్లవం పుణ్యమా అని పరిస్థితి తలకిందులైంది. యూపీఐ వాడకం పెరగడంతో దేశవ్యాప్తంగా ఏకంగా 9 వేల ఏటీఎమ్‌లు మూతపడినట్లు ఆర్‌బీఐ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్‌లు ఉపయోగిస్తున్నారు. కొబ్బరిబొండం కొన్నా, కూరగాయలు తీసుకెళ్లినా సరే జేబులోని ఫోన్ తీసి స్కాన్ చేయడం అలవాటుగా మారింది. దీనివల్ల వాలెట్‌లో నగదు ఉంచుకోవాల్సిన అవసరం తగ్గడమే కాకుండా, బ్యాంక్ ఖాతా నుంచి ఏటీఎమ్ ద్వారా డబ్బులు తీసే రోజులకూ తెరపడుతోంది. జనం రాక తగ్గడంతో నిర్వహణ భారం తట్టుకోలేక బ్యాంకులు కూడా నిరుపయోగంగా మారిన ఏటీఎమ్‌లను ఎత్తివేసే పనిలో పడ్డాయి.

ప్రైవేట్ బ్యాంకుల వెనకడుగు

ఏటీఎమ్‌ల నిర్వహణలో ప్రైవేట్ బ్యాంకులు తమ నెట్‌వర్క్‌ను తగ్గించుకుంటున్నాయి. మార్చి 2024లో దేశీయ ఏటీఎమ్ రంగాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ బ్యాంకుల వాటా 61.56 శాతంగా నమోదైంది. మార్చి 2026 నాటికి ఈ సంఖ్య 64.18 శాతానికి చేరింది. ఇదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల వాటా 36.51 శాతం నుంచి 33.76 శాతానికి దిగజారింది. కొత్త ఏటీఎమ్‌లు ఏర్పాటు చేసేందుకు నిరాసక్తి చూపుతున్న ప్రైవేట్ దిగ్గజాలు, డిజిటల్ లావాదేవీలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి.

పడిపోయిన నగదు విత్‌డ్రాయల్స్, డెబిట్ కార్డుల వాడకం

ఏటీఎమ్ యంత్రాలు తగ్గడమే కాకుండా, వాటి ద్వారా జరుగుతున్న లావాదేవీల విలువ సైతం దారుణంగా పడిపోయింది. మార్చి 2024 నాటికి ఏటీఎమ్‌లు, క్యాష్ రీసైక్లర్ల ద్వారా రూ. 2.77 లక్షల కోట్ల ఉపసంహరణలు జరగ్గా, జులై 2026 నాటికి ఆ మొత్తం రూ. 2.20 లక్షల కోట్లకు పడిపోయింది. దాదాపు 20 శాతానికి పైగా తగ్గుదల ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. డెబిట్ కార్డుల వినియోగం రూ. 3.21 లక్షల కోట్ల నుంచి రూ. 2.57 లక్షల కోట్లకు తగ్గిపోవడం డిజిటల్ విప్లవ వేగానికి అద్దం పడుతోంది.

భవిష్యత్తులో ఏటీఎమ్‌ల మనుగడు సాధ్యమేనా?

పట్టణ ప్రాంతాల్లో నగదు రహిత చెల్లింపులు పూర్తిస్థాయిలో ఊపందుకున్నాయి. అయితే గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో నగదు వినియోగం ఇప్పటికీ కొనసాగుతోంది. భవిష్యత్తులో పట్టణాల్లో ఏటీఎమ్‌లు మరింత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, గ్రామీణ భారతంలో వీటి అవసరం కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకులు సైతం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఏటీఎమ్‌లను కొనసాగించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి.

Tags: