EPFO : ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం.. ఇకపై నెలకు ఒకసారి కాకుండా ఏడాదికి ఒకేసారి పెట్టుబడి

ఇకపై నెలకు ఒకసారి కాకుండా ఏడాదికి ఒకేసారి పెట్టుబడి

Update: 2026-02-25 09:41 GMT

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన కోట్లాది మంది చందాదారుల కోసం పెట్టుబడి నిబంధనల్లో భారీ మార్పులు చేయబోతోంది. ఇప్పటివరకు తన వద్ద ఉన్న అదనపు ఆదాయాన్ని నెలకు ఒకసారి వివిధ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టే ఈపీఎఫ్‌ఓ, ఇకపై ఆ పద్ధతికి స్వస్తి పలకనుంది. 2016 నుండి అమల్లో ఉన్న పాత నిబంధనల స్థానంలో కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఐదు వేర్వేరు పథకాల నిధులను ఒకే చోట చేర్చి, ఏటా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ కొత్త విధానం వల్ల మార్కెట్ ఒడిదుడుకుల వల్ల కలిగే నష్టాలు తగ్గుతాయని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్ స్థానంలో వార్షిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ను అమలు చేయాలని చూస్తోంది. స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం.. రూ.25 కోట్ల కంటే ఎక్కువ నేరుగా లావాదేవీలు జరపాలంటే ఒకే ఏకీకృత వ్యవస్థ ఉండాలి. అందుకే, తన ఐదు స్కీమ్‌ల నిధులను ఒకే అకౌంట్‌లో వేసి, ఆ మొత్తాన్ని ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అటు నిబంధనలు పాటించినట్లు ఉంటుంది, ఇటు నిర్వహణ కూడా సులభతరం అవుతుందని భావిస్తున్నారు.

మరోవైపు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే డెవలప్‌మెంట్ ప్రకటించిన బైబ్యాక్ ఆఫర్‌లో కూడా ఈపీఎఫ్‌ఓ పాల్గొననుంది. తన వద్ద ఉన్న నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లను విక్రయించడం ద్వారా లాభాలను మూటగట్టుకోవాలని చూస్తోంది. ముఖ విలువ రూ.1,00,000 ఉన్న ప్రతి బాండ్‌ను రూ.1,03,468కి విక్రయించేందుకు సిద్ధమైంది. ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ ఆమోదించిన ఈ ప్రతిపాదనలు మార్చి 2న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలోనే కొత్త పెట్టుబడి విధానానికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.

అయితే ఈపీఎఫ్‌ఓ చందాదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్ల ప్రకటన మాత్రం ప్రస్తుత అజెండాలో లేకపోవడం గమనార్హం. కేవలం పెట్టుబడి పద్ధతులు, మార్కెట్ భాగస్వామ్యం, ఈటీఎఫ్ రిడెంప్షన్ గడువులపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. 2015 నుంచి తన ఆదాయంలో 5 నుంచి 15 శాతాన్ని ఈటీఎఫ్‌లలో మళ్లిస్తున్న ఈపీఎఫ్‌ఓ, ఇప్పుడు చేస్తున్న ఈ మార్పులు చందాదారుల సొమ్ముకు మరింత భద్రత, మెరుగైన రాబడిని ఇస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News