EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 2026లో రిటైర్ అవుతున్నారా? మీ పెన్షన్ లెక్క ఇదే
2026లో రిటైర్ అవుతున్నారా? మీ పెన్షన్ లెక్క ఇదే
EPFO : ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే కీలక పథకం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్(EPS). ముఖ్యంగా 2026లో పదవీ విరమణ చేయాలనుకునే వారు తమకు నెలకు ఎంత పెన్షన్ వస్తుందో ఇప్పుడే సులభంగా లెక్కించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతి ప్రైవేట్ ఉద్యోగి ఈ పెన్షన్ పొందేందుకు అర్హుడు.
పెన్షన్ ఎలా లెక్కించాలి?
చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు తమ పెన్షన్ లెక్కలు తెలియక ఆందోళన చెందుతుంటారు. కానీ ఈపీఎఫ్ఓ ఇందుకోసం ఒక సులభమైన ఫార్ములాను రూపొందించింది.
ఫార్ములా: (పదవీ విరమణకు ముందున్న సగటు జీతం * సర్వీసు కాలం)/70
అయితే ఇక్కడ ఒక కీలక నిబంధన ఉంది. ప్రస్తుతం పెన్షన్ లెక్కించడానికి గరిష్ట జీత పరిమితిని రూ.15,000 గా మాత్రమే నిర్ణయించారు. అంటే మీ అసలు బేసిక్ జీతం లక్షల్లో ఉన్నా, పెన్షన్ లెక్కించేటప్పుడు మాత్రం కేవలం రూ.15,000 మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
సర్వీసు నిబంధనలు ఏమిటి?
ఈ పెన్షన్ సౌకర్యం పొందాలంటే ఉద్యోగి కనీసం 10 ఏళ్ల పాటు పీఎఫ్ ఖాతాకు తన వాటా చెల్లించి ఉండాలి. సాధారణంగా 58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ అందుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా 50 ఏళ్లకే పెన్షన్ తీసుకోవాలనుకుంటే, ప్రతి ఏడుకి 4 శాతం చొప్పున పెన్షన్ మొత్తంలో కోత విధిస్తారు. కాబట్టి 58 ఏళ్ల వరకు వేచి చూడటమే లాభదాయకం. మీరు మీ కెరీర్ లో ఎన్ని కంపెనీలు మారినా, పీఎఫ్ నంబర్ ఒక్కటే ఉంటే మీ సర్వీసు మొత్తం కలిపి లెక్కిస్తారు.
ఒక ఉదాహరణతో చూద్దాం
కన్హయ్య అనే వ్యక్తి 2026లో రిటైర్ అవుతున్నాడు అనుకుందాం. అతను మొత్తం 50 ఏళ్ల పాటు పీఎఫ్ వాటా చెల్లించాడనుకుంటే (గరిష్ట సర్వీసు, వెయిటేజీ కలిపి), అతని పెన్షన్ లెక్క ఇలా ఉంటుంది:
15,000(జీతం) * 50 (సర్వీసు)/ 70 = సుమారు రూ.10,714
అంటే రిటైర్మెంట్ తర్వాత కన్హయ్యకు ప్రతి నెల రూ.10,714 పెన్షన్ గ్యారెంటీగా అందుతుంది. ఇది ప్రైవేట్ ఉద్యోగులకు ఒక నిశ్చిత ఆదాయ వనరుగా పనిచేస్తుంది.
శాలరీ నుంచి కట్ అయ్యే డబ్బు ఎక్కడికి పోతుంది?
ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ కట్ అవుతుంది. దీనికి సమానంగా కంపెనీ కూడా 12 శాతం జమ చేస్తుంది. అయితే కంపెనీ జమ చేసే ఆ 12 శాతంలో, 8.33 శాతం నేరుగా పెన్షన్ స్కీమ్‌లోకి వెళ్తుంది, మిగిలిన 3.67 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అంటే మీ రిటైర్మెంట్ నిధిలో మీ కంపెనీ వాటానే పెన్షన్‌గా మారి మీ వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తుంది.