EPFO : పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. తప్పుగా ఉన్న మెంబర్ ఐడీలను తొలగించుకోవడం ఇక ఈజీ
తప్పుగా ఉన్న మెంబర్ ఐడీలను తొలగించుకోవడం ఇక ఈజీ
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన ఖాతాదారులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. సాధారణంగా చాలామంది ఉద్యోగులకు తమకు తెలియకుండానే ఒకే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)కు ఒకటి కంటే ఎక్కువ లేదా తప్పుగా ఉన్న మెంబర్ ఐడీలు లింక్ అయి ఉంటాయి. దీనివల్ల పీఎఫ్ డబ్బులు డ్రా చేసేటప్పుడు లేదా బదిలీ చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ, తప్పుగా ఉన్న మెంబర్ ఐడీలను డీ-లింక్ చేసుకునే ప్రక్రియను ఈపీఎఫ్ఓ ఇప్పుడు మరింత సులభతరం చేసింది.
గతంలో ఒక మెంబర్ ఐడీని డీ-లింక్ చేయాలంటే ఆ ఖాతాలో ఎలాంటి కంట్రిబ్యూషన్ ఉండకూడదనే నిబంధన ఉండేది. కానీ, తాజా సర్క్యులర్ ప్రకారం.. ఉద్యోగికి తెలియకుండా సృష్టించబడిన తప్పుడు ఐడీలలో డబ్బులు ఉన్నప్పటికీ వాటిని తొలగించే అవకాశం కల్పించారు. దీనివల్ల పొరపాటున క్రియేట్ అయిన ఐడీల వల్ల అసలు పీఎఫ్ విడ్రాయల్ ఆగిపోకుండా ఉంటుంది. అయితే, సదరు ఐడీ ద్వారా ఇప్పటికే క్లెయిమ్ సెటిల్ అయ్యి ఉన్నా లేదా 6 సార్ల కంటే ఎక్కువ కంట్రిబ్యూషన్ జరిగి ఉన్నా ఈ డీ-లింక్ సదుపాయం అందుబాటులో ఉండదు.
డీ-లింక్ చేసే ప్రక్రియ కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. ఉద్యోగి పీఎఫ్ పోర్టల్ ద్వారా అభ్యర్థన పంపినప్పుడు, అది మొదట యజమాని లాగిన్‌కు వెళ్తుంది. యజమాని దానిని అంగీకరిస్తే, కంట్రిబ్యూషన్ 2 సార్ల కంటే తక్కువ ఉన్న సందర్భాల్లో వెంటనే డీ-లింక్ అవుతుంది. ఒకవేళ యజమాని స్పందించకపోయినా లేదా కంట్రిబ్యూషన్ 6 సార్ల లోపు ఉన్నా.. ఆ అభ్యర్థన క్షేత్రస్థాయి పరిశీలన కోసం రీజినల్ పీఎఫ్ ఆఫీసుకు చేరుతుంది. అక్కడ అధికారులు విచారణ జరిపి తగిన కారణాలతో డీ-లింక్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ ప్రక్రియను అనుసరించడానికి ఉద్యోగులు ముందుగా తమ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో View మెనూలోకి వెళ్లి Service History ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ యూఏఎన్‌కు లింక్ అయిన అన్ని మెంబర్ ఐడీలు కనిపిస్తాయి. అందులో ఏ ఐడీ తప్పుగా ఉందో దాని ఎదురుగా ఉండే Action కాలమ్ లోని De-link బటన్ క్లిక్ చేయాలి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా వాలిడేషన్ జరిపి, ఆ ఐడీ అర్హమైతే మీ సర్వీస్ హిస్టరీ నుంచి తొలగిస్తుంది.
మరి డీ-లింక్ చేసిన ఐడీలోని డబ్బుల పరిస్థితి ఏంటన్న అనుమానం రావచ్చు. ఇలా డీ-లింక్ చేసిన అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ను సస్పెన్స్ రిజర్వ్ ఫండ్ (SRF) కు ఎలా బదిలీ చేయాలి లేదా సర్దుబాటు చేయాలి అనే దానిపై ఈపీఎఫ్ఓ త్వరలోనే ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనుంది. ఈ కొత్త మార్పు వల్ల లక్షలాది మంది చందాదారులు తమ పీఎఫ్ బదిలీలు, విడ్రాయల్స్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.