Budget 2026 : సామాన్యుడి టెన్షన్..నిర్మలమ్మ యాక్షన్..ఈసారి ట్యాక్స్ బాంబు పేలుతుందా? ఊరటనిస్తుందా?

ఈసారి ట్యాక్స్ బాంబు పేలుతుందా? ఊరటనిస్తుందా?

Update: 2026-01-30 10:30 GMT

Budget 2026 : ఫిబ్రవరి 1, 2026.. ఈసారి ఆదివారం కావడంతో దేశమంతా సెలవు మూడ్‌లో ఉన్నా, మధ్యతరగతి ప్రజలు మాత్రం టీవీలకు అతుక్కుపోనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. గత ఎనిమిది సార్లు ఒక లెక్క, ఈసారి మరో లెక్క అన్నట్టుగా.. పన్నుల భారం తగ్గుతుందా? సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుందా? అని కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ నుంచి పన్ను చెల్లింపుదారులు, ఇన్వెస్టర్లు ఏం ఆశిస్తున్నారో వివరంగా తెలుసుకుందాం.

బడ్జెట్ 2026 నుంచి జీతగాళ్లు కోరుకునే మొదటి అంశం స్టాండర్డ్ డిడక్షన్ పెంపు. ప్రస్తుతం ఉన్న పరిమితి పెరిగిన ధరలకు సరిపోవడం లేదని, దీన్ని కనీసం రూ.1,00,000 వరకు పెంచాలని కోరుకుంటున్నారు. దీనివల్ల మధ్యతరగతి చేతిలో ఖర్చు పెట్టడానికి మరికొంత నగదు మిగులుతుంది. అలాగే, ట్యాక్స్ స్లాబులను మరింత సరళీకరించి, తక్కువ ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం తగ్గించేలా నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సొంతింటి కల కంటున్న వారికి హోమ్ లోన్ వడ్డీపై లభించే పన్ను మినహాయింపు అత్యంత కీలకం. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(బి) కింద ప్రస్తుతం ఏటా రూ.2 లక్షల వరకు మాత్రమే వడ్డీ రాయితీ లభిస్తోంది. కానీ ప్రస్తుతం ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచాలని రియల్ ఎస్టేట్ రంగం, కొనుగోలుదారులు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే, రియల్ ఎస్టేట్ రంగానికి భారీ బూస్ట్ లభించినట్టే.

ఆరోగ్య రంగం విషయంలో కూడా ప్రజలు భారీ ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించాలని లేదా మినహాయింపు పరిమితిని పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంలో భాగంగా ఇన్సూరెన్స్ పథకాల పరిధిని పెంచి, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకునే వారికి పన్ను రాయితీలు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే, ప్రైవేట్ ఆసుపత్రుల లాభాలపై ఒత్తిడి పడకుండా ప్రభుత్వ ధరలకు సేవలు అందించడం ఒక సవాలుగా మారనుంది.

మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఈసారి సుమారు రూ.12.6 ట్రిలియన్లు కేటాయించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే 13 శాతం పెరుగుదల ఉండవచ్చు. రోడ్లు, రైల్వేలు మరియు పోర్టుల అభివృద్ధికి నిధులు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఆర్థిక సర్వే ప్రకారం దేశ జీడీపీ వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేయడం ఇన్వెస్టర్లలో కొంత ధైర్యాన్ని నింపింది. ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ పెట్టెలో నుంచి వచ్చే ఆ అంకెలే సామాన్యుడి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Tags:    

Similar News