Budget : నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు..గతంలో ప్రధానులే బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన సందర్భాలివే
గతంలో ప్రధానులే బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన సందర్భాలివే
Budget : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. సాధారణంగా దేశ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రులే ప్రవేశపెడతారు, ఇది ఆనవాయితీ. కానీ, భారత రాజకీయ చరిత్రలో కొన్ని అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు స్వయంగా ప్రధానమంత్రులే ఆర్థిక మంత్రుల అవతారం ఎత్తి బడ్జెట్ ప్రసంగాలు చదివారు. అసలు దేశ ప్రధానులు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? ఆ ముగ్గురు ధీశాలురు ఎవరు? ఆసక్తికరమైన ఆ విశేషాలు తెలుసుకుందాం.
భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచారు. 1958-59 ఆర్థిక సంవత్సరానికి ఆయన బడ్జెట్‌ను సమర్పించారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న టీటీ కృష్ణమాచారి ముంద్రా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో నెహ్రూ ఆర్థిక శాఖ బాధ్యతలను తన వద్దే ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌లో ఆయన గిఫ్ట్ ట్యాక్స్ (కానుకలపై పన్ను) ప్రతిపాదనను తీసుకొచ్చారు. రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన ఆస్తి బదిలీలపై పన్ను విధించారు. అయితే భార్యకు ఇచ్చే రూ.లక్ష వరకు బహుమతులకు మినహాయింపు ఇవ్వడం అప్పట్లో విశేషం.
ఆ తర్వాత నెహ్రూ తనయ ఇందిరా గాంధీ కూడా అదే బాటలో నడిచారు. 1970లో ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్.. ఇందిరమ్మతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని హోదాలో ఉన్న ఇందిరా గాంధీ ఆర్థిక శాఖను కూడా నిర్వహించి ఫిబ్రవరి 28, 1970న బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆమె తన బడ్జెట్‌లో నెహ్రూ తెచ్చిన గిఫ్ట్ ట్యాక్స్ పరిమితిని రూ. 10 వేల నుంచి రూ. 5 వేలకు తగ్గించారు. అంతేకాకుండా సిగరెట్లపై పన్నును 3 శాతం నుంచి ఏకంగా 22 శాతానికి పెంచి పొగతాగే వారికి షాక్ ఇచ్చారు.
ఇక మూడవ ప్రధానిగా రాజీవ్ గాంధీ 1987-88 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న వి.పి.సింగ్, బోఫోర్స్ కుంభకోణం దర్యాప్తు విషయంలో రాజీవ్ గాంధీతో విభేదించి రాజీనామా చేశారు. బడ్జెట్ సమయానికి మరెవరికీ ఆ బాధ్యతలు ఇవ్వడం ఇష్టం లేక రాజీవ్ గాంధీ స్వయంగా బడ్జెట్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తన బడ్జెట్‌లో మోడ్రన్ టెక్నాలజీకి పెద్దపీట వేశారు. భారత పన్నుల చరిత్రలో మొదటిసారిగా కార్పొరేట్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీనే. దేశీ, విదేశీ కంపెనీల ఆదాయంపై పన్నులు విధించడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచారు.
మొత్తానికి ఆర్థిక మంత్రుల రాజీనామాలు లేదా రాజకీయ సంక్షోభాల వల్ల ఈ ముగ్గురు ప్రధానులు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏ ప్రధాని కూడా అటువంటి సాహసం చేయలేదు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంతో ఈ పాత రికార్డులన్నింటినీ అధిగమించి, సుస్థిర ఆర్థిక పాలనలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంటున్నారు. ఫిబ్రవరి 1న ఆమె చేసే ప్రసంగంపై ఇప్పుడు యావత్ భారత్ ఆశలు పెట్టుకుంది.