Fed Decision : వడ్డీ రేట్లలో మార్పు లేదు.. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ఫెడ్ సంచలన నిర్ణయం

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ఫెడ్ సంచలన నిర్ణయం;

Update: 2025-06-19 02:09 GMT

Fed Decision : ప్రపంచంలోని రెండు ప్రధాన దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనను రేకెత్తించింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సమయంలో.. ముడి చమురు ధరలు నుండి బంగారం, డాలర్ వరకు భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్న వేళ, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఫెడ్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయకుండా వాటిని స్థిరంగా ఉంచాలని ప్రకటించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు కొంత ఉపశమనం కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది.

బుధవారం జరిగిన రెండు రోజుల సమావేశం తర్వాత ఫెడ్ ఈ ప్రకటన చేసింది. దీని ప్రకారం, బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 4.25% వద్దే స్థిరంగా ఉంచుతారు. అయితే, ఈ సంవత్సరం చివరి నాటికి రేట్లలో కోత విధించే అవకాశం ఉందని అంచనా వేశారు. అమెరికా ఇంకా ద్రవ్యోల్బణం, స్లో ఎకానమిక్ గ్రోత్ అనే ద్వంద్వ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత వడ్డీ రేట్లే అనుకూలంగా ఉంటాయని కమిటీ అభిప్రాయపడింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని, అయితే ద్రవ్యోల్బణం విషయంలో రాబోయే రోజుల్లో కొత్త సవాళ్లు తలెత్తవచ్చని ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ అన్నారు.

ఫెడ్ నిర్ణయాన్ని అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా స్వాగతించాయి. డావ్ జోన్స్ 100 పాయింట్లు పెరిగింది. అయితే S&P 500 0.33% వృద్ధిని నమోదు చేసింది. నాస్‌డాక్ లో కూడా 0.51% పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీల షేర్లు మంచి గ్రోత్ చూపించాయి.

ట్రంప్ ఆగ్రహం - ఫెడ్‌పై రాజకీయ దాడి:

ఫెడ్ ప్రకటనకు కొద్దిసేపటి ముందు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్‌పై దాడి చేస్తూ.. ఆయనను "వెర్రివాడు" అని అభివర్ణించాడు. పావెల్‌కు తనంటే ఇష్టం లేదని వడ్డీ రేట్లలో కోత విధించాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్‌మెంట్

ఎఫ్‌ఓఎంసీ (FOMC) సమావేశం తర్వాత పావెల్ మాట్లాడుతూ.. నికర ఎగుమతులు, టారిఫ్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు కనిపించాయని, అయితే కార్మిక మార్కెట్, ఉపాధి పరిస్థితి ఇప్పటికీ బలంగా ఉన్నాయని చెప్పారు. 2% ద్రవ్యోల్బణం, పూర్తి ఉపాధి సాధించడమే ఫెడ్ ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ లక్ష్యాలను చేరుకోవడం సవాలుతో కూడుకున్నదని అన్నారు.

Tags:    

Similar News