FII Outflow : స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పరార్.. 30 రోజుల్లో రూ.48,000 కోట్ల విక్రయాలు.. అసలు కారణం ఇదే
30 రోజుల్లో రూ.48,000 కోట్ల విక్రయాలు.. అసలు కారణం ఇదే
FII Outflow : భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిష్క్రమణ పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడినా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మాత్రం మన మార్కెట్లలో షేర్లను విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు వారు భారీగా నిధులను వెనక్కి తీసుకోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల పట్ల తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఏకంగా రూ.48,213 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గడచిన 40 రోజుల వ్యవధిని పరిశీలిస్తే ఈ అమ్మకాల విలువ రూ.1.66 లక్షల కోట్లు దాటడం గమనార్హం. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.1.79 లక్షల కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా మార్చి నెల యుద్ధం కారణంగా ఈ ఏడాదిలోనే అత్యంత దారుణమైన నెలగా నిలిచింది, ఆ ఒక్క నెలలోనే రూ.1,17,775 కోట్ల అమ్మకాలు జరిగాయి.
భారత మార్కెట్లలో షేర్ల విలువ ఎక్కువగా ఉండటం, మరోవైపు దక్షిణ కొరియా, తైవాన్ వంటి మార్కెట్లలో 2026లో లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉండటంతో ఇన్వెస్టర్లు తమ నిధులను అక్కడికి తరలిస్తున్నారు. ఈ నెలలో దక్షిణ కొరియాలోకి 3.6 బిలియన్ డాలర్లు, తైవాన్ లోకి 5.6 బిలియన్ డాలర్ల నిధులు రాగా, భారత్ నుండి మాత్రం 3 బిలియన్ డాలర్ల నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ నిపుణుడు డాక్టర్ వి.కె. విజయకుమార్ అభిప్రాయం ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుతం భారత్ కంటే తూర్పు ఆసియా మార్కెట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
శుక్రవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 275 పాయింట్లు పెరిగి 24,050 వద్ద, సెన్సెక్స్ 918 పాయింట్లు పెరిగి 77,550 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లు రాణించడంతో మార్కెట్ నిలదొక్కుకుంది. అయితే, ఈ పెరుగుదల ఎక్కువగా దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల వల్లే సాధ్యమైంది. శనివారం అమెరికా-ఇరాన్ మధ్య జరగనున్న శాంతి చర్చల ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చర్చలు సఫలమైతే ముడిచమురు ధరలు తగ్గి, భారత మార్కెట్లకు ఊతం లభిస్తుంది.
భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ముడిచమురు ధరలు అత్యంత కీలకం. యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే మార్కెట్లు పతనం అవుతాయి. చర్చల ద్వారా యుద్ధ మేఘాలు తొలగిపోతే మాత్రం మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నప్పటికీ, మొత్తం మార్కెట్ ధోరణి మాత్రం విదేశీ ఇన్వెస్టర్ల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టర్లు తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ అడుగులు వేయడం ఉత్తమం.