Ethanol : ఇక పెట్రోల్, డీజిల్ టెన్షన్ ఖతం.. చెరకు రసంతో పరిగెత్తనున్న బండ్లు

చెరకు రసంతో పరిగెత్తనున్న బండ్లు

Update: 2026-05-21 10:39 GMT

Ethanol : భారతదేశంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల భారం నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన ప్లాన్‌ను సిద్ధం చేసింది. భవిష్యత్తులో మన దేశంలో చెరకు రసం, మొక్కజొన్నల నుంచి తయారు చేసే ఎథనాల్ ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. అయితే, ఈ సరికొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చే ముందే భారతీయ ఆటోమొబైల్ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీలు ప్రభుత్వం ముందు ఒక పెద్ద డిమాండ్‌ను ఉంచాయి. ఎథనాల్ ఇంధనం ధరలను పెట్రోల్ కంటే భారీగా తగ్గించడంతో పాటు, ఈ వాహనాలపై జీఎస్‌టీని తగ్గిస్తేనే జనం కొంటారని ఆటో కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

అసలు ఏంటి ఈ E85, E100 ఇంధనం?

సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. ప్రస్తుతం మనం వాడుతున్న పెట్రోల్‌లో కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే ఎథనాల్ (E20) కలుపుతున్నారు. కానీ రాబోయే ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లలో వాడేందుకు E85, E100 ఇంధనాలను తీసుకురానున్నారు. E85 అంటే అందులో 85 శాతం ఎథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటుంది. ఇక E100 అంటే అది 100 శాతం ప్యూర్ ఎథనాల్ అన్నమాట. అయితే పెట్రోల్‌తో పోలిస్తే ఎథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల బండ్ల మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అందుకే బ్రెజిల్ దేశంలో లాగా ఇక్కడ కూడా ఎథనాల్ ధరను పెట్రోల్ కంటే చాలా తక్కువగా ఉంచితేనే, మైలేజ్ నష్టాన్ని కస్టమర్లు భరిస్తారని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) చెబుతోంది.

కొత్త టెక్నాలజీతో పెరగనున్న బండ్ల ధరలు

సాధారణ ఇంజన్లలో 100 శాతం ఎథనాల్ ఇంధనాన్ని వాడటం కుదరదు. దీనికోసం మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా, బజాజ్, హోండా వంటి కంపెనీలు ప్రత్యేకమైన ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంధన వ్యవస్థలను, సరికొత్త ఇంజన్లను డిజైన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వాహనాల తయారీ ఖర్చు పెరిగి కార్లు, బైకుల రేట్లు ఎక్కువవుతాయి. ఈ భారాన్ని తగ్గించడానికి వాహనాలపై ఉన్న 18 నుంచి 40 శాతం జీఎస్‌టీని భారీగా తగ్గించాలని హీరో మోటోకార్ప్ వంటి సంస్థలు కోరుతున్నాయి. అయితే కార్లపై పన్ను తగ్గిస్తే.. అవి కేవలం 5 శాతం జీఎస్‌టీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీగా మారుతాయని కేంద్రం ఆలోచిస్తోంది. అందుకే కార్ల కంటే ముందు టూ-వీలర్ల (బైకులు, స్కూటర్లు) కు పన్ను మినహాయింపులు ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఎథనాల్‌పై మోదీ సర్కార్ ఎందుకు ఇంతలా పట్టుబడుతోంది?

భారతదేశం తన దేశీయ అవసరాల కోసం ఏకంగా 90 శాతం ముడిచమురును అరబ్, ఇతర విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం ప్రతి సంవత్సరం 120 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 లక్షల కోట్లు) విదేశీ కరెన్సీని ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా మిడిల్ ఈస్ట్‌లో తరచూ జరిగే ఇరాన్ యుద్ధాల వంటి ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ముప్పు పొంచి ఉంటోంది. మన దేశంలో ట్రాన్స్‌పోర్ట్ రంగంలోనే 95 శాతం పెట్రోల్, 70 శాతం డీజిల్ వాడకం జరుగుతోంది. ఒకవేళ మన దేశంలోనే పండే చెరకు, వ్యవసాయ వ్యర్థాల నుండి ఎథనాల్ తయారు చేస్తే.. ఆ రూ.10 లక్షల కోట్ల దేశ సంపద విదేశాలకు పోకుండా మన భారతీయ రైతులకు దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

20 బిలియన్ లీటర్ల కెపాసిటీ సిద్ధం

భారతీయ ప్రమాణాల బ్యూరో ఇప్పటికే ఎథనాల్ ఇంధనానికి సంబంధించిన సరికొత్త టెక్నికల్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. దేశంలో ఎథనాల్ ఉత్పత్తి సామర్థ్యం కూడా రికార్డు స్థాయిలో 20 బిలియన్ లీటర్లకు చేరుకుంది, కానీ ప్రస్తుతం మన దేశంలో డిమాండ్ కేవలం 11 బిలియన్ లీటర్లు మాత్రమే ఉంది. అంటే ఇంధనానికి కొరత లేదు. అయితే, చెరకు నుంచి నేరుగా ఎథనాల్ తయారు చేయడానికి విపరీతంగా నీటిని వాడాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి కొరత రాకుండా ఉండేందుకు.. కేవలం చెరకు రసం మాత్రమే కాకుండా, వ్యవసాయ వ్యర్థాలు, వరి తవుడు, పాడైపోయిన ధాన్యం (సెకండ్ జనరేషన్ ఎథనాల్) నుంచి ఇంధనాన్ని తయారు చేయాలని నీతి ఆయోగ్ నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News