FMCG Slowdown: దేశీయ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్ తీవ్రమైన మందగమనాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ధరలు, తగ్గిన వర్షపాతం, పడిపోయిన ఆదాయం కారణంగా ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఏకంగా 68 శాతం రోజూ వాడే ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. నీల్సన్ ఐక్యూ క్యూ-2 నివేదిక ప్రకారం ఎఫ్‌ఎంసీజీ బాస్కెట్ మొత్తం వాల్యూమ్ రెండు శాతం తగ్గింది. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా కస్టమర్లు అత్యవసరమైన వస్తువులను కూడా చాలా లెక్కలేసుకుని కొనుగోలు చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలపై ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం

ఈ మందగమనం ప్రభావం పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపైనే అత్యధికంగా పడింది. గ్రామాల్లో ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు ఐదు శాతం క్షీణించాయి. వ్యవసాయ రంగంలో వర్షాలు ఆలస్యం కావడం, పంటల సాగు తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర సహా 7 రాష్ట్రాల్లోనే మొత్తం క్షీణతలో 86 శాతం నమోదైంది.

మారుతున్న షాపింగ్ పద్ధతులు

సాంప్రదాయ కిరాణా దుకాణాల వ్యాపారం ఆరు శాతం తగ్గగా, ఆధునిక సూపర్ మార్కెట్లలో 17.5 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ఆన్‌లైన్ షాపింగ్ జోరు విపరీతంగా పెరిగింది. ఈ-కామర్స్ రంగంలో విక్రయాలు 34.8 శాతం జంప్ చేశాయి. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆన్‌లైన్ కొనుగోళ్లు 3 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో 10 నిమిషాల డెలివరీ ఇస్తున్న క్విక్ కామర్స్ హవా నడుస్తోంది.

చిన్న కంపెనీలకు బిగ్ షాక్

పెద్ద కంపెనీలు నష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉన్నప్పటికీ, చిన్న కంపెనీలు మాత్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రూ.5000 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థల అమ్మకాలు కేవలం ఒక శాతం తగ్గగా, 100 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న చిన్న కంపెనీల విక్రయాలు 10.5 శాతం పడిపోయాయి. ఐదు నుంచి పది రూపాయల చిన్న ప్యాకెట్ల విక్రయం కంపెనీలకు భారంగా మారింది.

నిత్యవసర వస్తువుల అమ్మకాల్లోనూ తగ్గుదల

గతంలో విలాస వస్తువులపై మాత్రమే కనిపించిన మందగమనం ఇప్పుడు నేరుగా నిత్యవసరాల మీద పడింది. ఆహార పదార్థాల విక్రయాలు 1.1 శాతం తగ్గగా, హోమ్ కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు 4.3 శాతం పడిపోయాయి. పిల్లల సంరక్షణ వస్తువులు, చర్మ సంరక్షణ క్రీములు, ఓటీసీ మందుల విక్రయాలు కూడా భారీగా తగ్గాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో మార్కెట్ కోలుకోవడంపై ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags: