Tata Motors: భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టాటా సన్స్‎ రాబోయే వార్షిక సాధారణ సమావేశానికి ముందు నోయల్ టాటా, ఎన్ చంద్రశేఖరన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్‎ టాటా.. చంద్రశేఖరన్‌ను డైరెక్టర్‌గా తిరిగి నియమించాలనే బోర్డు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంతర్గత పోరు కారణంగా టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి కీలక కంపెనీలు తీవ్రమైన ధర్మసంకటంలో పడ్డాయి.

కంపెనీల ముందు భారీ సవాల్, ఓటింగ్ డైలమా

టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ వంటి ప్రముఖ కంపెనీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. టాటా సన్స్‎‌లో ఈ 10 ఆపరేటింగ్ కంపెనీలకు కలిపి 12.86 శాతం వాటా ఉంది. ఏజీఎంలో ఈ కంపెనీలు వేసే ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. అయితే ఏ ఒక్కరి వైపు మొగ్గు చూపినా గ్రూప్‌లో వర్గపోరును సమర్థిస్తున్నారనే ముద్ర పడుతుందనే భయంతో ఈ కంపెనీలు ఓటింగ్ నుంచి దూరంగా ఉండాలని చూస్తున్నాయి.

చంద్రశేఖరన్ నియామకం చుట్టూ అలుముకున్న వివాదం

అక్టోబర్ 2016లో టాటా సన్స్‎ బోర్డులో చేరిన చంద్రశేఖరన్.. జనవరి 2017లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. బోర్డు మరో ఐదేళ్లపాటు ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్నుకుంటూ సెప్టెంబర్ 17న తీర్మానం చేసింది. అయితే ఆయన చైర్మన్‌గా కొనసాగాలంటే బోర్డు డైరెక్టర్‌గా ఉండటం తప్పనిసరి. టాటా ట్రస్ట్స్ మెజారిటీ వాటా కలిగి ఉండటంతో నోయల్‎ టాటా వ్యతిరేకత ఈ నియామకానికి పెద్ద అడ్డంకిగా మారింది.

ఏజీఎం వాయిదా పడటానికి అసలు కారణాలు

మొదట ఆగస్టు 18న జరగాల్సిన టాటా సన్స్‎ ఏజీఎం కోరం కుదరకపోవడంతో వాయిదా పడింది. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్ సమావేశాలు నిర్వహించడంపై కొన్ని ఆంక్షలు విధించారు. దీంతో ట్రస్ట్ ప్రతినిధులు సమావేశానికి హాజరుకాలేకపోయారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కంపెనీ రిజిస్ట్రార్ నుంచి మూడు నెలల గడువు కోరారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సహాయంతో ఈ సమావేశం పూర్తి చేసేందుకు మార్గాలు వెతుకుతున్నారు.

భవిష్యత్తుపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు

ఇలాంటి వివాదాలు టాటా గ్రూప్ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కంపెనీ కూడా ఏ ఒక్క వర్గాన్ని బహిరంగంగా వ్యతిరేకించి భవిష్యత్తులో ఇబ్బందులు కొనితెచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ గందరగోళం నుంచి బయటపడేందుకు కంపెనీలు ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్‌సీఎల్టీ జోక్యంతో ఈ వివాదానికి ఎలాంటి తెర పడుతుందనేది వేచి చూడాలి.

Tags: