Forbes Richest List Out: అపర కుబేరుల కొత్త జాబితా.. ముకేశ్ అంబానీ టాప్.. టాప్ 10లో ఎవరున్నారు?
టాప్ 10లో ఎవరున్నారు?;
Forbes Richest List Out: ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2025 జూలై నెలకు సంబంధించిన ప్రపంచ కుబేరుల జాబితాను తాజాగా విడుదల చేసింది. భారతదేశంలో ధనవంతుల జాబితాపై ప్రతేడాది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ఈసారి కూడా ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితా అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచే రేసులో మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పైచేయి సాధించారు. ఆయన మొత్తం నికర సంపద సుమారు $116 బిలియన్లు (సుమారు రూ.9.5 లక్షల కోట్లు) చేరుకుందని అంచనా. దీంతో ఆయన కేవలం భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
రెండో, మూడో స్థానాల్లో ఎవరు?
ముకేశ్ అంబానీ తర్వాత రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన నికర సంపద సుమారు 84 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అదానీ గ్రూప్ ముఖ్యంగా ఇంధనం, పోర్టులు, మౌలిక సదుపాయాల రంగంలో విస్తరించి, భారతదేశ ఆర్థిక రంగంలో ఒక కీలక ముఖంగా మారింది. గత కొన్ని సంవత్సరాలలో కొన్ని వివాదాలు, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఆయన ర్యాంకింగ్‌లో మార్పులు వచ్చినా, ఆయన ఇప్పటికీ టాప్ 2లో కొనసాగుతున్నారు.
మూడో స్థానంలో టెక్నాలజీ రంగ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఉన్నారు. ఆయన నికర సంపద సుమారు 36.9 బిలియన్ డాలర్లు. ఇక, భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా సావిత్రి జిందాల్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర సంపద 33.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఫోర్బ్స్ వెల్లడించింది.
టాప్ 10 జాబితాలో ఇతర ప్రముఖ పేర్లలో దిలీప్ సంఘ్వి (సన్ ఫార్మా), సైరస్ పూనవాలా(సీరం ఇన్‌స్టిట్యూట్), కుశాల్ పాల్ సింగ్(డీఎల్‌ఎఫ్), కుమార్ మంగలం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్), రాధాకిషన్ దమానీ (డీమార్ట్) ఉన్నారు. ఇక, పదవ స్థానంలో లక్ష్మీ మిట్టల్ (ఆర్సెలర్ మిట్టల్) నిలిచారు. ఈ జాబితా నుంచి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశ పారిశ్రామికవేత్తలు కేవలం దేశంలోనే కాకుండా, ప్రపంచ స్థాయిలో కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ, రిటైల్, ఫార్మా, మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో బలమైన పట్టు సాధించి, ఈ వ్యాపార దిగ్గజాలు ప్రతి సంవత్సరం కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు.