Dollar Vs Rupee : డాలర్ కొండెక్కి కూర్చోవడంతో భారీగా పెరిగిన టూర్ ప్యాకేజీలు.. మీ బడ్జెట్ లో మార్పులు చేసుకోవాల్సిందే

మీ బడ్జెట్ లో మార్పులు చేసుకోవాల్సిందే

Update: 2026-04-06 09:06 GMT

Dollar Vs Rupee : వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. పిల్లలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు అనుకున్న బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. గత కొన్ని నెలలుగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దారుణంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం రూపాయి విలువ 94 నుంచి 95 రూపాయల వద్ద చారిత్రాత్మక కనిష్టానికి చేరుకోవడంతో, మీ విదేశీ ట్రిప్ ఖర్చు ఒక్కసారిగా భారమైపోయింది. రూపాయి పతనంతో పర్యాటకుల జేబులకు చిల్లు పడుతున్న తీరుపై ప్రత్యేక కథనం ఇక్కడ ఉంది.

బడ్జెట్ లెక్కలు తారుమారు

రూపాయి బలహీనపడటం వల్ల మీరు ప్లాన్ చేసిన టూర్ ఖర్చు నేరుగా 12 నుంచి 20 శాతం వరకు పెరిగిపోయింది. ఉదాహరణకు, గతేడాది రూ.2 లక్షల బడ్జెట్‌తో వెళ్లిన ట్రిప్ కు ఇప్పుడు కనీసం రూ.2.4 లక్షలు ఖర్చవుతోంది. అదే ఒక పెద్ద కుటుంబం రూ.6 లక్షల బడ్జెట్ అనుకుంటే, ఇప్పుడు ఆ బిల్లు ఏకంగా రూ.7 లక్షలకు చేరుతోంది. అంటే ఎక్స్‌ట్రా సౌకర్యాలు ఏమీ పెరగకపోయినా, కేవలం కరెన్సీ మార్పిడి వల్లే మీరు అదనంగా లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా విమాన టిక్కెట్లు (15% పెంపు), హోటల్ గదులు మరియు స్థానిక ఖర్చులు పర్యాటకులను హడలెత్తిస్తున్నాయి.

అమెరికా, యూరప్ వెళ్తే షాక్ తప్పదు

కరెన్సీ విలువ పతనం అన్ని దేశాలపై ఒకేలా లేదు. మీరు అమెరికా, బ్రిటన్, యూరప్ లేదా దుబాయ్ వంటి దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తే మీకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఈ దేశాల కరెన్సీలు డాలర్ లేదా యూరోతో నేరుగా ముడిపడి ఉండటంతో అక్కడ ప్రయాణ ఖర్చులు 20 శాతం వరకు పెరిగాయి. అయితే, బడ్జెట్ లో పర్యటన ముగించాలనుకునే వారికి థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలు మెరుగైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్థానిక కరెన్సీలు కొంత స్థిరంగా ఉండటంతో ఖర్చులో పెరుగుదల కేవలం 10 శాతం లోపే ఉంది.

దాగి ఉన్న ఖర్చుల మాయాజాలం

ఫ్లైట్, హోటల్ మాత్రమే కాదు.. వీసా ఫీజులు, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కూడా డాలర్లలో చెల్లించాల్సి రావడంతో అవి కూడా ప్రియమయ్యాయి. విదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడితే పడే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కప్ ఛార్జీలు, టిసిఎస్ పన్నులు మీ బడ్జెట్ ను మరింత దెబ్బతీస్తాయి. పరిస్థితి ఇలా ఉన్నా భారతీయులు ప్రయాణాలను రద్దు చేసుకోవడం లేదు కానీ, తమ ప్రణాళికలను మార్చుకుంటున్నారు. 15 రోజుల ట్రిప్ కు బదులు వారం రోజులే వెళ్లి రావడం, విలాసవంతమైన షాపింగ్ తగ్గించుకోవడం వంటివి చేస్తూ కేవలం అనుభూతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

స్మార్ట్ ప్లానింగ్‌తో నష్టాన్ని తగ్గించుకోండి

రూపాయి విలువను మనం నియంత్రించలేం కానీ, మన ఖర్చులను ప్లాన్ చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లేవారు చివరి నిమిషంలో బుకింగ్స్ చేయకుండా ముందుగానే ఫ్లైట్ టిక్కెట్లు, హోటళ్లు బుక్ చేసుకోవడం మంచిది. అలాగే, ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడం వల్ల హెచ్చుతగ్గుల నుంచి తప్పించుకోవచ్చు. విదేశాల్లో ఖర్చుల కోసం ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్ వాడటం ఉత్తమం. ఇది కార్డు స్వైప్ చేసిన ప్రతిసారీ పడే ఎక్స్ఛేంజ్ ఛార్జీల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. వీలైతే ఆల్-ఇంక్లూజివ్ ప్యాకేజీలను ఎంచుకోవడం ద్వారా అదనపు ఖర్చుల టెన్షన్ లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

Tags:    

Similar News