FSSAI Ban : డ్యాబర్ తేనె, ఆవు నెయ్యి కొంటున్నారా?.. 100% నాచురల్ ప్రచారాలపై కేంద్రం నిషేధం

100% నాచురల్ ప్రచారాలపై కేంద్రం నిషేధం

Update: 2026-08-04 08:51 GMT

FSSAI Ban : వంటగది అవసరాలకు లేదా ఆరోగ్య రక్షణ కోసం డాబర్ బ్రాండ్‌కు చెందిన తేనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. సదరు ఉత్పత్తుల ప్యాకెట్లు, బాటిళ్లపై 100% ప్యూర్, 100% నాచురల్ అని రాసి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నందున, భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డ్యాబర్ ఇండియా లిమిటెడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇటువంటి భ్రాంతి కలిగించే క్లెయిమ్‌లతో కూడిన ఉత్పత్తుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏ ఏ ఉత్పత్తులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రడార్‌లో పడ్డాయి?

ఎఫ్‌ఎస్‌ఎస్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లేమ్స్) రెగ్యులేషన్స్ 2018 ప్రకారం 100% అనే పదం స్పష్టత లేనిది, నిర్ధారించలేనిది, కస్టమర్లను మోసగించేలా ఉందని ఫుడ్ రెగ్యులేటర్ స్పష్టం చేసింది. డ్యాబర్ తన వెబ్‌సైట్, మార్కెట్‌లో విక్రయిస్తున్న తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి పాలు, లేత కొబ్బరి నీళ్లు వంటి అనేక ఉత్పత్తులపై 100% ప్యూరిటీ గ్యారెంటీడ్, 100% ఆర్గానిక్ అని అక్రమంగా ప్రచారం చేస్తోందని తేలింది. డ్యాబర్ హిమాలయన్ ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఆర్గానిక్ తేనెపై చెల్లుబాటు అయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆర్గానిక్ సర్టిఫికేషన్ లేకుండానే జైవిక్ భారత్ లోగోను కూడా వాడినట్లు అధికారులు గుర్తించారు.

గతంలో హెచ్చరించినా మారని వైఖరి

గతంలో కూడా ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రచారాలను నిలిపివేయాలని డాబర్ కంపెనీకి నోటీసులు జారీ చేసినప్పటికీ, కంపెనీ సరియైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, సదరు భ్రాంతి కలిగించే లేబుల్స్ ఉన్న అన్ని ఉత్పత్తుల అమ్మకాలను తక్షణమే ఆపివేయాలని, 15 రోజుల్లోగా తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ATR) సమర్పించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ డాబర్‌ను ఆదేశించింది. దీనిపై స్పందించిన డ్యాబర్ యాజమాన్యం, నోటీసు అందిందని, తమ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని సమీక్షిస్తున్నామని తెలిపింది.

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కఠిన చర్యలు

గత కొన్ని నెలలుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతూ, తప్పుదోవ పట్టించే ఆహార పదార్థాలు, లిక్కర్ బ్రాండ్లు, ఎనర్జీ డ్రింక్స్ తయారుచేసే సంస్థలపై నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ తరహా కఠిన నిర్ణయాల ద్వారా బ్రాండ్లు ఏవైనా సరే.. నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని, గాలిమాటలతో కస్టమర్లను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఫుడ్ రెగ్యులేటర్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News