LPG Cylinder: దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. గ్యాస్ సిలిండర్ ఇ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి ఇచ్చిన గడువు ముగియడానికి మరో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆగస్టు 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో గ్యాస్ సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు కనెక్షన్‌పై ఇబ్బందులు ఎదురుకానున్నాయి. వంట గ్యాస్ సిలిండర్లు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందాలనే లక్ష్యంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఆధార్ ఆధారిత ఇ-కేవైసీని తప్పనిసరి చేశాయి. గతంలో ఆగస్టు 15, ఆ తర్వాత ఆగస్టు 23 వరకు ఉన్న గడువును వినియోగదారుల సౌకర్యార్థం చివరిసారిగా ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఇంకా ఇ-కేవైసీ పూర్తి చేయని వారికి ఇదే ఆఖరి అవకాశమని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 31 తర్వాత ఇ-కేవైసీ లేని కనెక్షన్లకు సబ్సిడీ వర్తించదని, వీరు కమర్షియల్ ధర చెల్లించి సిలిండర్లను బుక్ చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇ-కేవైసీ చేయకపోతే ఎదురయ్యే సమస్యలు

చమురు సంస్థలు జారీ చేసిన ఆదేశాల ప్రకారం నిర్ణీత గడువులోగా బయోమెట్రిక్ లేదా ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే కస్టమర్ ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ సొమ్ము జమ కాదు. కొన్ని సందర్భాల్లో కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. ప్రతి అభ్యర్థనను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మటే కొత్త ఆర్డర్లను అనుమతిస్తారు. అందువల్ల ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా ఇ-కేవైసీ చేసుకునే విధానం

గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడే అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సులువైన విధానం ఇదిగో:

*మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీరు వాడుతున్న గ్యాస్ కంపెనీ (ఇండేన్, భారత్ గ్యాస్, లేదా హెచ్‌పి గ్యాస్) అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* దీనితో పాటు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

* గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావలసి ఉంటుంది.

* హోమ్‌పేజీలో కనిపించే 'LPG e-KYC' లేదా 'Re-KYC' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అందులోని నిబంధనలను చదివి అంగీకారం తెలిపిన తర్వాత క్యాప్చర్ ఫేస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* వెంటనే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి.

మొబైల్‌లో ఫేస్ స్కాన్ ద్వారా వివరాలు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో సమస్యలు వస్తే నేరుగా మీ ఏజెన్సీకి వెళ్లేసి ఆధార్ కార్డు కాపీ ఇచ్చి బయోమెట్రిక్ నమోదు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పని పూర్తి చేసుకుని సిలిండర్ల సేవలను ఆటంకం లేకుండా పొందండి.

Tags: