New GDP Method : జీడీపీ లెక్కల్లో భారీ మార్పు.. ఇక నుంచి కొత్త బేస్ ఇయర్‌తోనే వృద్ధి అంచనాలు

ఇక నుంచి కొత్త బేస్ ఇయర్‌తోనే వృద్ధి అంచనాలు

Update: 2026-02-26 08:25 GMT

 New GDP Method : దేశ ఆర్థిక ప్రయాణంలో రేపు (ఫిబ్రవరి 27) ఒక కీలకమైన మలుపు రాబోతోంది. భారతదేశ ఆర్థిక ఎదుగుదలను కొలిచే ప్రధాన కొలమానం జీడీపీ లెక్కించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటివరకు 2011-12ను బేస్ ఇయర్‌గా తీసుకుని లెక్కలు వేస్తుండగా, ఇకపై 2022-23ని కొత్త బేస్ ఇయర్‌గా పరిగణించనున్నారు. మన ఆర్థిక వ్యవస్థ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా డేటాను అప్‌డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ మార్కెట్, కరోనా తర్వాతి మార్పులను పాత ఫార్ములా సరిగ్గా ప్రతిబింబించలేకపోవడమే ఈ మార్పుకు ప్రధాన కారణం.

జీడీపీ లెక్కలను మార్చడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. జీఎస్టీ అమలు, కోవిడ్ మహమ్మారి వల్ల ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీనికి తోడు, 2025 నవంబర్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి భారత జాతీయ ఖాతాల గణాంకాల్లో కొన్ని లోపాలను ఎత్తిచూపుతూ C రేటింగ్ ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం, డేటా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఇకపై ప్రతి ఐదేళ్లకోసారి బేస్ ఇయర్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల డిజిటల్ సేవలు, గ్రీన్ ఎనర్జీ, సరికొత్త పెట్టుబడుల వాటా జీడీపీలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే జీఎస్టీ డేటా, వినియోగ సర్వేలను వాడటం వల్ల అసంఘటిత రంగం, గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్సర్స్) కష్టం కూడా దేశ లెక్కల్లోకి చేరుతుంది.

ముఖ్యంగా తయారీ రంగం వృద్ధిని అంచనా వేసేందుకు డబుల్ డిఫ్లేషన్ అనే అత్యాధునిక పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ముడిసరుకు ధరలు, తయారైన వస్తువుల ధరల మధ్య వ్యత్యాసాన్ని మరింత కచ్చితంగా కొలవవచ్చు. అసంఘటిత రంగాన్ని లెక్కించడానికి వాహన రిజిస్ట్రేషన్లు, ఇంధన వినియోగం వంటి హై-ఫ్రీక్వెన్సీ డేటాను వాడుతున్నారు. ఈ కొత్త పద్ధతుల వల్ల మన దేశ వృద్ధి రేటు గతంలో కంటే వేగంగా కనిపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సేవారంగం వాటా పెరగడం వల్ల ఓవరాల్ జీడీపీ వృద్ధి రేటు పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ మార్పులు సామాన్యుడిపై కూడా ప్రభావం చూపుతాయి. కొత్త జీడీపీ లెక్కల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్ల విధానాన్ని, ద్రవ్యోల్బణ కట్టడి చర్యలను నిర్ణయిస్తుంది. అంటే మీ లోన్ ఈఎంఐలు, డిపాజిట్లపై వచ్చే వడ్డీలు కూడా ఈ కొత్త గణాంకాలపై ఆధారపడి ఉంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగినట్లు కనిపిస్తే, విదేశీ పెట్టుబడులు మరింతగా వచ్చే అవకాశం ఉంటుంది. వెరసి, ఈ కొత్త జీడీపీ లెక్కలు భారతదేశాన్ని సరికొత్త ఆర్థిక శక్తిగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు దోహదపడతాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.

Tags:    

Similar News