Gen Z Career : జీతం తక్కువైనా పర్లేదు.. నేర్చుకునే అవకాశం ఉండాలి.. జెన్ జీ యువత నయా ట్రెండ్

నేర్చుకునే అవకాశం ఉండాలి.. జెన్ జీ యువత నయా ట్రెండ్

Update: 2026-03-19 09:02 GMT

Gen Z Career : ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న జెన్ జీ నిపుణులు కెరీర్ పట్ల చాలా క్లారిటీతో ఉన్నారు. అన్‌స్టాప్ టాలెంట్ 2026 నివేదిక వెల్లడించిన దాని ప్రకారం.. సుమారు 60 శాతం మంది యువత తమ ఉద్యోగ ఎంపికలో జీతం కంటే నైపుణ్యాభివృద్ధికే ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు. మంచి పని వాతావరణం, ఎదుగుదలకు అవకాశాలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లభిస్తే.. కొంచెం తక్కువ జీతానికైనా పని చేయడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. పాత తరంలాగా కేవలం డబ్బు కోసం ఇష్టం లేని పనిని ఏళ్ల తరబడి చేయడానికి నేటి యువత ఇష్టపడటం లేదు.

కంపెనీలు, యువత మధ్య పెరుగుతున్న అగాధం

యువత ఆలోచనలు వేగంగా మారుతున్నా, కంపెనీలు మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నాయి. నివేదిక ప్రకారం.. కేవలం 36 శాతం మంది హెచ్ఆర్ లీడర్లు మాత్రమే నేటి తరాన్ని సరిగ్గా మేనేజ్ చేయగలమని భావిస్తున్నారు. అంటే కంపెనీల ఆలోచనలకు, యువత ఆకాంక్షలకు మధ్య పెద్ద గ్యాప్ ఉంది. సరైన గ్రోత్ అవకాశాలు కనిపించకపోవడం వల్లే దాదాపు సగం మంది యువ ఉద్యోగులు మొదటి ఏడాదిలోనే రాజీనామాలు చేస్తున్నారు. కేవలం భారీ ప్యాకేజీలు ఆశ చూపి టాలెంట్‌ను ఎక్కువ కాలం కంపెనీలో ఉంచుకోలేమని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

పారదర్శకత లేకపోతే రిజెక్ట్

నేటి యువత కేవలం పని చేయడమే కాదు, ఆ కంపెనీలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయి? జీతం ఎలా పెరుగుతుంది? తమ కెరీర్ పాత్ ఎలా ఉండబోతోంది? వంటి విషయాల్లో క్లారిటీ లేకపోతే వారు ఆ కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. రిక్రూట్‌మెంట్ సమయంలోనే కంపెనీలు పారదర్శకంగా లేవని అనిపిస్తే, అభ్యర్థులు మధ్యలోనే ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి తప్పుకుంటున్నారు. నమ్మకం, పారదర్శకత అనేవి జెన్ జీకి చాలా ముఖ్యమైన అంశాలు.

ఇంటర్న్‌షిప్ నుంచి ఫుల్-టైమ్ వరకు..

ఒకప్పుడు ఇంటర్న్‌షిప్ అంటే కేవలం సర్టిఫికెట్ కోసం చేసేది. కానీ ఇప్పుడు అది కెరీర్ పునాదిగా మారింది. విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్ సమయంలో కేవలం సైద్ధాంతిక విషయాలు కాకుండా, నిజమైన పని నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. అయితే, చాలా కంపెనీలు ఇంటర్న్‌షిప్ ఇస్తున్నా, వారిని ఫుల్-టైమ్ ఉద్యోగులుగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాయి. మరోవైపు, విద్యార్థులు కూడా కేవలం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పైనే ఆధారపడకుండా, బయట మార్కెట్లో మంచి అవకాశాల కోసం వేట సాగిస్తున్నారు. ముఖ్యంగా టెక్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని బడా కంపెనీలు నేటి యువతకు డ్రీమ్ డెస్టినేషన్లుగా మారుతున్నాయి.

Tags:    

Similar News