Gold Buying Guide : బంగారం కొనడానికి ముందు ఈ లెక్క చూడండి.. తులం నగపై అదనంగా ఎన్ని వేలు కట్టాలో తెలుసా?
తులం నగపై అదనంగా ఎన్ని వేలు కట్టాలో తెలుసా?
Gold Buying Guide : బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. పేపర్లో లేదా టీవీల్లో కనిపించే ధరను చూసి, అదే రేటుకు నగలు వచ్చేస్తాయని అనుకుంటే పొరపాటే. మీరు ఒక తులం (10 గ్రాముల) నగ చేయించుకోవాలని షాపుకు వెళ్తే.. అక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి. అసలు ధరపై మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కలిసి మీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తాయి. అందుకే బంగారం కొనడానికి ముందు ఈ చిన్న లెక్కను క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం.
బేస్ ప్రైస్ అంటే ఏమిటి?
సాధారణంగా 24 క్యారెట్ల బంగారం పెట్టుబడికి మాత్రమే పనికొస్తుంది. అది చాలా మెత్తగా ఉండటం వల్ల నగలు తయారు చేయడం సాధ్యం కాదు. అందుకే నగలను 22 క్యారెట్లు లేదా 18 క్యారెట్లతో చేస్తారు. ఏప్రిల్ 2026 లెక్కల ప్రకారం.. ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,560 పలుకుతోంది. మీరు 10 గ్రాముల హారం చేయించుకోవాలనుకుంటే ఇదే మీ బేస్ ప్రైస్.
మేకింగ్ చార్జీలు, జీఎస్టీ లెక్క
నగ తయారీలో స్వర్ణకారుడి కూలి, డిజైన్ కోసం అయ్యే ఖర్చునే మేకింగ్ చార్జీలు అంటారు. ఇది నగ డిజైన్‌ను బట్టి 8% నుంచి 15% వరకు ఉంటుంది. ఒకవేళ సగటున 10% మేకింగ్ చార్జీలు అనుకుంటే, రూ.1,42,560 పై రూ.14,256 అదనంగా పడుతుంది. ఇప్పుడు అసలు ధర, మేకింగ్ చార్జీలు కలిపితే మొత్తం రూ.1,56,816 అవుతుంది. దీనిపై మళ్ళీ ప్రభుత్వం 3% జీఎస్టీని వసూలు చేస్తుంది. అంటే మరో రూ.4,704 అదనంగా జతవుతాయి. వెరసి, పేపర్లో రూ.1.42 లక్షలుగా ఉన్న బంగారం మీ చేతికి నగగా వచ్చేసరికి సుమారు రూ.1,61,520 అవుతుంది.
స్మార్ట్ కొనుగోలుదారుగా మీరు చేయాల్సినవి
బంగారం కొనేటప్పుడు కేవలం డిజైన్ మాత్రమే కాదు, హాల్‌మార్క్ ముద్ర ఉందో లేదో కచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యంగా HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబర్ ఉంటేనే అది అసలైన బంగారం అని నమ్మవచ్చు. మేకింగ్ చార్జీలు అనేవి ఫిక్స్‌డ్ రేట్లు కావు. షాపు యజమానితో బేరమాడి వీటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. యాంటిక్ లేదా హెవీ డిజైన్లు ఎంచుకుంటే చార్జీలు పెరుగుతాయని గుర్తుంచుకోండి.
పక్కా బిల్లు అడగండి
నగలు కొన్నప్పుడు పక్కా బిల్లు అడగండి. కాగితపు రసీదులు వద్దు. అందులో బంగారం ధర, బరువు, క్యారెట్ నాణ్యత, మేకింగ్ చార్జీలు, జీఎస్టీ విడివిడిగా రాసి ఉండాలి. అలాగే భవిష్యత్తులో ఆ నగను తిరిగి అమ్మితే లేదా మార్చుకుంటే ఎంత శాతం కటింగ్ ఉంటుందనే బై-బ్యాక్ పాలసీ గురించి ముందే అడిగి తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మీరు పెట్టిన పెట్టుబడికి సరైన విలువ లభిస్తుంది.