Gold Loan : తక్కువ బంగారం..ఎక్కువ లోన్..ఆనందంలో జనం..భయపడుతున్న బ్యాంకర్లు
ఎక్కువ లోన్..ఆనందంలో జనం..భయపడుతున్న బ్యాంకర్లు
Gold Loan : గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరలు కొండెక్కి కూర్చోవడంతో దేశంలో సరికొత్త ఆర్థిక ధోరణి కనిపిస్తోంది. పసిడి ధరలు పెరగడం సామాన్యులకు షాక్ ఇచ్చినా, అదే బంగారంపై రుణాలు తీసుకునే వారికి మాత్రం వరంగా మారింది. భారత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. నవంబర్ 2025 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 125 శాతం వృద్ధిని నమోదు చేసింది. బంగారం విలువ పెరగడంతో బ్యాంకులు ఇచ్చే రుణ మొత్తం కూడా పెరగడం ఇందుకు ప్రధాన కారణం.
రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం.. నవంబర్ 2023లో కేవలం రూ.898 కోట్లుగా ఉన్న బంగారం రుణాల బకాయిలు, నవంబర్ 2024 నాటికి రూ.1.59 లక్షల కోట్లకు, ఇప్పుడు నవంబర్ 2025 నాటికి ఏకంగా రూ.3.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2025లో 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ.1.35 లక్షలకు చేరడంతో, కస్టమర్లు తమ వద్ద ఉన్న తక్కువ బంగారంతోనే ఎక్కువ మొత్తంలో లోన్ పొందగలుగుతున్నారు. దీనినే ఆర్థిక పరిభాషలో కొలేటరల్ వాల్యూ పెరగడం అని అంటారు. ఐఐఎఫ్ఎల్ వంటి సంస్థలు ఈ మార్పును పసిడి రుణాల చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నాయి.
గోల్డ్ లోన్ మార్కెట్లో ఇప్పటివరకు ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల హవా నడిచేది. కానీ ఇప్పుడు బ్యాంకులు రంగంలోకి దిగి పట్టు సాధించాయి. ప్రస్తుతం గోల్డ్ లోన్ మార్కెట్ వాటాలో బ్యాంకులు 50.35 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల బకాయిలు కూడా రూ.3 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండటంతో జనం బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తం రుణ బకాయిల్లో గోల్డ్ లోన్ల వాటా సెప్టెంబర్ నాటికి 5.8 శాతంగా ఉంది.
జీఎస్టీ కోత, పండుగ సీజన్ ఆఫర్ల ప్రభావం వెహికల్ లోన్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది. నవంబర్ చివరి నాటికి వెహికల్ లోన్స్ రూ.6.8 లక్షల కోట్లకు పెరిగాయి, ఇది 11 శాతం వృద్ధి. మరోవైపు పర్సనల్ లోన్లు 12.7 శాతం, సర్వీస్ రంగ రుణాలు 11.7 శాతం మేర పెరిగాయి. అయితే అక్టోబర్‌తో పండుగ సీజన్ ముగియడంతో వినియోగ రుణాలు కొంత తగ్గుముఖం పట్టాయి. వేతనాల పెరుగుదల వేగవంతం అయితే తప్ప కన్సంప్షన్ మళ్ళీ పుంజుకోదని ఐసీఐసీఐ బ్యాంక్ పరిశోధన నివేదిక వెల్లడించింది.
హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గడంతో హౌసింగ్ సెక్టార్‌కు ఇచ్చే రుణాలు 9.8 శాతం పెరిగి రూ.31.9 లక్షల కోట్లకు చేరాయి. వ్యాపార రంగానికి ఇచ్చే బ్యాంక్ రుణాలు అత్యధికంగా 14 శాతం పెరిగి రూ.12.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అమెరికా ప్రభుత్వం భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధించడంతో ఎగుమతిదారులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోవడానికి ఆర్‌బీఐ డిసెంబర్ వరకు లోన్ మారిటోరియం (చెల్లింపుల వాయిదా) ఇచ్చింది, ఇది వ్యాపారవేత్తలకు పెద్ద ఊరటనిచ్చింది.