Gold Loan : వడ్డీ కట్టలేక చస్తున్నారా? అయితే ఈ గోల్డ్ ట్రిక్ తెలుసుకోండి.. లక్షలు ఆదా చేయండి

అయితే ఈ గోల్డ్ ట్రిక్ తెలుసుకోండి.. లక్షలు ఆదా చేయండి

Update: 2026-04-08 04:32 GMT

Gold Loan : భారతీయ కుటుంబాల్లో బంగారం కేవలం అలంకారం మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఒక ఆపద్బాంధవుడు. అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే మనందరికీ మొదట గుర్తొచ్చేది గోల్డ్ లోన్. అయితే, ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ లోన్ కంటే ఫ్లెక్సిబుల్‌గా ఉండే మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్. దీని గురించి తెలిస్తే మీరు సాధారణ గోల్డ్ లోన్ జోలికి వెళ్లరు.

గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఏమిటి?

సాధారణంగా మనం గోల్డ్ లోన్ తీసుకుంటే, బ్యాంక్ మన నగలను బట్టి ఒకేసారి పెద్ద మొత్తాన్ని మన చేతిలో పెడుతుంది. కానీ గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ పద్ధతి అలా కాదు. మీరు మీ బంగారాన్ని బ్యాంకులో పెట్టినప్పుడు, బ్యాంక్ మీ పేరు మీద ఒక క్రెడిట్ లిమిట్‌ను కేటాయిస్తుంది. ఉదాహరణకు, మీ బంగారం విలువను బట్టి రూ.5 లక్షల లిమిట్ ఇచ్చారనుకోండి, ఆ డబ్బు మొత్తం మీ అకౌంట్‌లోనే ఉంటుంది. మీకు ఎప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే వాడుకోవచ్చు.

వడ్డీ లెక్క ఎలా ఉంటుంది?

గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ లో ఉన్న అసలైన కిటుకు ఇదే. మీరు తీసుకున్న 5 లక్షల లిమిట్‌లో కేవలం రూ.50,000 మాత్రమే వాడుకుంటే, ఆ యాభై వేల మీద మాత్రమే వడ్డీ పడుతుంది. మిగిలిన రూ.4.50 లక్షల మీద ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు వడ్డీ భారం భారీగా తగ్గుతుంది.

సాధారణ గోల్డ్ లోన్ vs ఓవర్‌డ్రాఫ్ట్

సాధారణ గోల్డ్ లోన్ తీసుకుంటే మీరు మొత్తం సొమ్ము వాడినా వాడకపోయినా, తీసుకున్న మొత్తం అమౌంట్‌పై వడ్డీ కట్టాలి. కానీ ఓవర్‌డ్రాఫ్ట్‌లో యూజ్ చేసినంతే వడ్డీ అనే సూత్రం పనిచేస్తుంది. పైగా, మీరు వాడుకున్న డబ్బును తిరిగి అకౌంట్‌లో జమ చేస్తే వడ్డీ మీటర్ ఆగిపోతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. దీని కోసం ప్రతిసారీ బ్యాంకుకు వెళ్లి కొత్తగా లోన్ అప్లై చేయాల్సిన పని లేదు.

ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది?

చిన్న వ్యాపారులు, అత్యవసర వైద్య ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నవారు, పిల్లల ఫీజుల కోసం అప్పుడప్పుడు డబ్బు కావాల్సిన వారికి ఇది వరం లాంటిది. ఒక్కసారి నగలు బ్యాంకులో పెట్టి లిమిట్ సెట్ చేసుకుంటే, అది ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా మీకు తోడుంటుంది. క్రెడిట్ కార్డు కంటే తక్కువ వడ్డీకి, పర్సనల్ లోన్ కంటే వేగంగా ఈ సదుపాయం పొందవచ్చు.

చాలా బ్యాంకులు, ముత్తూట్, మణప్పురం వంటి ఫైనాన్స్ సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇందులో ప్రాసెసింగ్ ఫీజులు, రెన్యువల్ ఛార్జీలు ఎలా ఉన్నాయో ముందే కనుక్కోవడం మంచిది. మీ దగ్గర ఉన్న బంగారానికి సుమారు 75% వరకు రుణ పరిమితిని బ్యాంకులు కల్పిస్తాయి.

Tags:    

Similar News