Gold Price: గత నాలుగు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి పరుగుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో రికార్డు స్థాయి లాభాల తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే పసిడి తగ్గినా వెండి మాత్రం కస్టమర్లకు షాక్ ఇస్తూ ముందుకు సాగుతోంది. తులం బంగారంపై రూ.600 మేర ధర తగ్గింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.1,66,500కి చేరుకుంది. క్రితం సెషన్‌లో ఇది రూ.1,67,100 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు, దేశీయంగా ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడం వల్ల పసిడి తగ్గడానికి ప్రధాన కారణంగా మారింది.

షాక్ ఇస్తున్న వెండి, కిలో ఎంతంటే?

బంగారం దారిలో కాకుండా వెండి మాత్రం తన దూకుడును నిలబెట్టుకుంది. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 2,50,500కి చేరింది. మంగళవారం ముగింపు సమయానికి రూ.2.50 లక్షలుగా ఉన్న వెండి ధర, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరగడంతో మళ్లీ రేట్లు పుంజుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వర్గాలు స్పష్టం చేశాయి.

పసిడి పతనానికి అసలు కారణాలు ఇవే

అమెరికాలో రాబోయే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ద్రవ్యోల్బణ గణాంకాలకు ముందు డాలర్ ఇండెక్స్ బలపడటం పసిడిని ప్రభావితం చేసింది. కొద్ది వారాలుగా పసిడి వరుస రికార్డులను తిరగరాయడంతో ట్రేడర్లు పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దీనికి తోడు అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తగ్గడం, చైనా సెంట్రల్ బ్యాంక్ నిలకడగా బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇన్నాళ్లూ విపరీతంగా పెరిగిన ధరలు ఇప్పుడు కాస్త సర్దుబాటు అవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటే?

గ్లోబల్ మార్కెట్‌లోనూ బంగారం స్వల్పంగా పడిపోయింది. స్పాట్ గోల్డ్ దాదాపు 1 శాతం మేర క్షీణించి ఔన్సుకు 4,619 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఒమాన్, ఇరాన్‌లు హోర్ముజ్ జలసంధి సేవలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తుండటంతో క్రూడ్ ఆయిల్ సరఫరా ఆందోళనలు తగ్గి చమురు ధరలు శాంతించాయి. ఈ పరిణామాలు కూడా గోల్డ్ ఈటీఎఫ్ హోల్డింగ్స్ పై ప్రభావం చూపాయి.

Tags: