Gold Prices : బంగారం పరుగులు పెడుతున్నా ఈ కంపెనీలు ఎందుకు ఏడుస్తున్నాయి? అసలు కారణాలివే!

అసలు కారణాలివే!

Update: 2025-12-25 07:25 GMT

Gold Prices : బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రికార్డు మీద రికార్డు సృష్టిస్తూ పసిడి పరుగు పెడుతోంది. గత ఏడాది కాలంలోనే బంగారం ధరలు దాదాపు 70 శాతం పైగా పెరిగాయి. అయితే ఆశ్చర్యకరంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ, జ్యువెలరీ కంపెనీల షేర్లు మాత్రం స్టాక్ మార్కెట్లో కుప్పకూలుతున్నాయి. సాధారణంగా బంగారం రేటు పెరిగితే ఈ కంపెనీలకు లాభాలు రావాలి, కానీ సీన్ రివర్స్ అయింది. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే టాప్ 10 జ్యువెలరీ కంపెనీల్లో 8 కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. టైటాన్, తంగమయిల్ వంటి ఒకట్రెండు కంపెనీలు మినహాయిస్తే మిగిలిన దిగ్గజాల పరిస్థితి దారుణంగా ఉంది.

గణాంకాలను గమనిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పీసీ జ్యువెలర్ షేర్లు ఏడాదిలో ఏకంగా 44 శాతం పడిపోయాయి. సెంకో గోల్డ్ 43.5 శాతం, కల్యాణ్ జ్యువెలర్స్ 35 శాతం నష్టపోయాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పీఎన్ గాడ్గిల్, బ్లూస్టోన్ వంటి కంపెనీలు కూడా నష్టాల బాటలోనే ఉన్నాయి. కేవలం టైటాన్ కంపెనీ మాత్రమే తన బ్రాండ్ ఇమేజ్ వల్ల 17 శాతం లాభంతో నిలదొక్కుకోగలిగింది. బంగారం రేటు పెరిగినంత వేగంగా ఈ కంపెనీల ఆదాయం పెరగకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ధర పెరిగినా షేర్లు ఎందుకు పడిపోతున్నాయి?

దీనికి నిపుణులు ప్రధానంగా మూడు కారణాలను చెబుతున్నారు. మొదటిది, పెరిగిన పెట్టుబడి ఖర్చు. జ్యువెలరీ కంపెనీలకు బంగారం అనేది ముడి సరుకు. ధరలు పెరిగితే వారు కొత్తగా బంగారం కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది, దీనివల్ల కంపెనీల లాభాల మార్జిన్ తగ్గుతుంది. రెండవది, తగ్గుతున్న అమ్మకాలు. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు కొనుగోళ్లు తగ్గించేశారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ, ఎక్కువ బరువున్న నగలకు బదులు లైట్ వెయిట్ ఆభరణాలకే మొగ్గు చూపుతున్నారు. మూడవది నగదు లభ్యత తగ్గడం. వడ్డీ రేట్లు పెరగడం వల్ల అప్పులు ఎక్కువగా ఉన్న జ్యువెలరీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది.

మారుతున్న కస్టమర్ల టేస్ట్

బంగారం రేటు భారం కావడంతో కస్టమర్ల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు 22 క్యారెట్ల బంగారం మాత్రమే కొనేవారు, ఇప్పుడు నెమ్మదిగా 18 క్యారెట్, 14 క్యారెట్ల నగలకు మళ్లుతున్నారు. దీనివల్ల కంపెనీలకు వచ్చే ఆదాయం తగ్గుతోంది. అయితే, జ్యువెలరీ రంగానికి భవిష్యత్తు లేదని దీని అర్థం కాదు. 2029 నాటికి వ్యవస్థీకృత జ్యువెలరీ మార్కెట్ రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. కాబట్టి, ప్రస్తుతానికి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని, కేవలం మంచి బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలనే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News