Gold Silver Price : గత వారం భారీగా పతనమైన పసిడి, వెండి ధరలు.. c

ఈ వారం కొనుగోలు చేయవచ్చా?

Update: 2026-06-08 06:00 GMT

Gold Silver Price : గత వారం బంగారం, వెండి మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు గట్టి షాక్ తగిలింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతంగా పెరిగిన అమ్మకాల ఒత్తిడి కారణంగా రెండు కీర్తి కిరీటాలైన పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఈ ధరలు ఏ దిశగా సాగుతాయనే దానిపై మార్కెట్ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ రోజు (జూన్ 8, 2026) మార్కెట్ నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వారం రాబోయే అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు, గ్లోబల్ పరిణామాలు బంగారం, వెండి భవితవ్యాన్ని తేల్చనున్నాయి.

మార్కెట్ చూపు అంతర్జాతీయ గణాంకాల వైపు

ఈ వారం బులియన్ మార్కెట్ గమనాన్ని నిర్దేశించడంలో చైనా, అమెరికా దేశాల ట్రేడ్, ద్రవ్యోల్బణం లెక్కలు చాలా కీలకం కానున్నాయి. వీటితో పాటు అమెరికా కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా మరియు మన భారతదేశానికి చెందిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదల కానున్నాయి. ఈ కీలక సమాచారం ఆధారంగానే వడ్డీ రేట్లు, ఆర్థిక కార్యకలాపాలపై ఒక స్పష్టత వస్తుంది. ఇవన్నీ నేరుగా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) తీసుకోబోయే మానిటరీ పాలసీ నిర్ణయాలు కూడా డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్‌ను ప్రభావితం చేస్తాయి.

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. క్రూడాయిల్ ఎఫెక్ట్

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు బంగారంపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేదా టెన్షన్స్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల బంగారం రేట్లు పెరుగుతాయి. కానీ, గత కొన్ని రోజులుగా ముడిచమురు ధరలలో కనిపిస్తున్న విపరీతమైన తేడాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఇతర మార్కెట్ల వైపు మళ్లిస్తున్నాయి. దీనివల్ల బంగారానికి ఆశించిన స్థాయిలో డిమాండ్ పెరగడం లేదు.

గత వారం ఎంత మేర తగ్గాయంటే

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు డెలివరీ గోల్డ్ గత వారం ఏకంగా రూ.5,317 (దాదాపు 3.3 శాతం) నష్టపోయి 10 గ్రాములకు రూ.1.55 లక్షల వద్ద క్లోజ్ అయింది. అదే సమయంలో జూలై డెలివరీ వెండి ధర కూడా ఘోరంగా పడిపోయింది. కిలో వెండి ఏకంగా రూ.18,461 (సుమారు 7 శాతం) క్షీణించి రూ.2.48 లక్షల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‎లో కూడా ఇదే ట్రెండ్ నడిచింది. అక్కడ బంగారం ధర 5 శాతం, వెండి ధర దాదాపు 9 శాతం వరకు పతనమై ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి.

వచ్చే వారం ట్రెండ్ ఎలా ఉండబోతోంది

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే బంగారం, వెండి ధరలలో తక్షణమే పెద్ద రికవరీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, ఇప్పుడప్పుడే ఇవి పుంజుకోలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం కరెక్షన్ నడుస్తోందని చెప్తున్నారు. బలమైన యూఎస్ డాలర్, గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్న వడ్డీ రేట్ల అంచనాలు, రూపాయి విలువ స్థిరంగా ఉండటం వంటి అంశాలు కమోడిటీ మార్కెట్‌పై ఒత్తిడిని కొనసాగిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గనుక ఔన్స్‌కు 4,400 నుంచి 4,500 డాలర్ల కంటే తక్కువ స్థాయిలోనే ట్రేడ్ అయితే.. ధరల పెరుగుదల చాలా పరిమితంగా ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు వచ్చే వారం వచ్చే ఆర్థిక నివేదికలను చూసి జాగ్రత్తగా ముందడుగు వేయడం మంచిది.

Tags:    

Similar News