DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూలై నుంచి 4% డీఏ పెంపు ఖాయం?

జూలై నుంచి 4% డీఏ పెంపు ఖాయం?;

Update: 2025-07-07 02:33 GMT

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. జులై 2025 నుంచి డియర్‌నెస్ అలవెన్స్ (DA) లో 4% పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ తాజా గణాంకాలు ఈ అంచనాను మరింత బలపరుస్తున్నాయి. మే 2025లో ఈ ఇండెక్స్ 0.5 పాయింట్లు పెరిగి 144 కి చేరింది. మార్చి నుంచి మే వరకు ఇది నిలకడగా పెరుగుతూ వచ్చింది. మార్చిలో 143, ఏప్రిల్‌లో 143.5, ఇప్పుడు మేలో 144. ఒకవేళ జూన్ 2025లో కూడా ఇండెక్స్ 0.5 పాయింట్లు పెరిగితే, డీఏ 55శాతం నుండి 59శాతానికి పెరిగే అవకాశం ఉంది.

డీఏ పెంపు వెనుక ఉన్న లెక్కలు

డీఏను గత 12 నెలల AICPI-IW సగటు ఆధారంగా లెక్కిస్తారు. 7వ వేతన సంఘంసిఫార్సుల ప్రకారం, దీనికి ఒక ఫార్ములా ఉంది: డీఏ (%) = [(గత 12 నెలల CPI-IW సగటు) ÷ 261.42] × 100

ఇక్కడ 261.42 అనేది ఇండెక్స్ బేస్ వాల్యూ. ఒకవేళ జూన్ 2025లో AICPI-IW 144.5 కు చేరుకుంటే, 12 నెలల సగటు సుమారు 144.17 అవుతుంది. ఈ సగటును ఫార్ములాలో వేస్తే డీఏ దాదాపు 58.85శాతంగా వస్తుంది. దీనిని రౌండ్ ఆఫ్ చేసి 59శాతంగా పరిగణిస్తారు. అంటే, ప్రస్తుతం ఉన్న 55శాతం నుండి 4శాతం పెంపు ఉంటుంది. జనవరి నుండి మే వరకు ఉన్న గణాంకాలు 3శాతం పెంపును సూచించాయి.. కానీ జూన్ డేటా దీన్ని 4% కి తీసుకురాగలదు.

డీఏ ప్రకటన ఎప్పుడు వస్తుంది?

కొత్త డీఏ జూలై 2025 నుండి అమలులోకి వస్తుంది. అయితే ప్రభుత్వం సాధారణంగా దీన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ముఖ్యంగా పండుగల సీజన్ చుట్టూ ప్రకటిస్తుంది. ఈసారి కూడా దీపావళి సమయంలో ఈ పెద్ద ప్రకటన రావచ్చని ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జులై-డిసెంబర్ 2025 కాలానికి సంబంధించిన ఈ డీఏ పెంపు 7వ వేతన సంఘం కింద చివరి పెంపు అవుతుంది. ఎందుకంటే ఈ సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025 తో ముగుస్తోంది. మరోవైపు, 8వ వేతన సంఘం జనవరి 2025లో ప్రకటించబడినప్పటికీ, దీని చైర్మన్, ప్యానెల్ సభ్యుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇంకా విడుదల కాలేదు. ఏప్రిల్ నాటికి ToR సిద్ధమై కమిషన్ పని ప్రారంభించవచ్చని ప్రభుత్వం సూచించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట అప్‌డేట్ రాలేదు.

8వ వేతన సంఘం ఆలస్యం కావచ్చా?

గత వేతన సంఘాల చరిత్రను పరిశీలిస్తే, వాటి సిఫార్సులు అమలు కావడానికి 18 నుండి 24 నెలల సమయం పడుతుంది. ఈ లెక్కన 8వ వేతన సంఘం సిఫార్సులు 2027 నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీని అర్థం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు తమ ప్రస్తుత బేసిక్ జీతంపై ఇంకా చాలా డీఏ పెంపులు లభిస్తాయి.

Tags:    

Similar News