Remittance Transfer : ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. అమెరికాలో తగ్గిన రెమిటెన్స్ ట్యాక్స్!
అమెరికాలో తగ్గిన రెమిటెన్స్ ట్యాక్స్!;
Remittance Transfer : అమెరికా ప్రభుత్వం రెమిటెన్స్ ట్రాన్స్ ఫర్ పై 3.5% పన్ను విధించాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు రెమిటెన్స్ పన్నును 3.5% బదులు కేవలం 1% మాత్రమే పెంచాలని నిర్ణయించింది. ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ సవరించిన ముసాయిదా చట్టంలో రెమిటెన్స్ ట్యాక్స్ పెంపును తగ్గించే ప్రతిపాదన ఉంది. భారత్ నుంచి దూరంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు ఈ పరిణామం కాస్త ఊరట కలిగించింది. ఒకవేళ 3.5% పన్ను అమలై ఉంటే, భారతీయులు తమ స్వదేశానికి డబ్బు పంపడానికి వెనుకాడే అవకాశం ఉండేది.
బిగ్ బ్యూటిఫుల్ బిల్ సవరించిన ముసాయిదా బిల్లులో మరో ఊరట కలిగించే విషయం ఉంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలలోని అకౌంట్ల ద్వారా పంపే డబ్బును పన్ను పరిధి నుండి మినహాయించే ప్రతిపాదన ఉంది. అలాగే, అమెరికాలో ఇచ్చిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ల ద్వారా చేసే డబ్బు బదిలీలకు కూడా పన్ను ఉండదు. అంటే, చాలా వరకు రెమిటెన్స్‌లకు పన్ను ఉండదన్నమాట. ఇది ఎన్ఆర్ఐలకు చాలా పెద్ద ఉపశమనం.
మొదటి ముసాయిదా బిల్లులో ఏకంగా 5% రెమిటెన్స్ పన్ను విధించాలని ప్రతిపాదించారు. ఇది విని భారతీయ ప్రవాసులు నిరాశ చెందారు. ఆ తర్వాత దానిని 3.5%కి తగ్గించాలని నిర్ణయించారు. ఇప్పుడు సవరించిన ముసాయిదా బిల్లులో రెమిటెన్స్ పన్నును 1%కి తగ్గించాలని ప్రతిపాదించడం వారికి నిజంగా శుభవార్త. అమెరికాలో విదేశీ కమ్యూనిటీల సంఖ్య చాలా ఎక్కువ. చైనీయులు కాకుండా, అత్యధిక విదేశీ కమ్యూనిటీ అంటే భారతీయులదే. 2023లో అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తుల సంఖ్య 29 లక్షలు ఉంది. 2023-24 సంవత్సరంలో అమెరికా నుండి రెమిటెన్స్ ద్వారా భారతదేశానికి వచ్చిన మొత్తం 32 బిలియన్ డాలర్లు. భారతదేశానికి వచ్చే మొత్తం రెమిటెన్స్ ఆదాయంలో అమెరికా వాటా 27.7% అని తెలుస్తోంది.