YouTube : యూట్యూబ్‌లో ప్రతి వీడియోను కనిపెట్టడం మా వల్ల కాదు.. హైకోర్టుకు గూగుల్ ఆన్సర్
హైకోర్టుకు గూగుల్ ఆన్సర్
YouTube : ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ఢిల్లీ హైకోర్టులో ఒక కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఆన్‌లైన్ విచారణలను రికార్డ్ చేసి, వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే వారిని ముందే గుర్తించి అడ్డుకోవడం తమకు సాధ్యం కాదని గూగుల్ స్పష్టం చేసింది. ఇలాంటి వీడియోలను ఎవరైనా మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేయకుండా శాశ్వతంగా నిరోధించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించడం చట్టపరంగా, సాంకేతికంగా అసాధ్యమని కోర్టుకు వివరించింది. డిజిటల్ యుగంలో కంటెంట్ నియంత్రణపై జరుగుతున్న చర్చల మధ్య గూగుల్ ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏది చట్టబద్ధమో ముందే గుర్తించడం ఎలా?
కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో గూగుల్ తన నిస్సహాయతకు గల సాంకేతిక కారణాలను వివరంగా పేర్కొంది. ఏ కోర్టు విచారణల వీడియో కూడా నేరుగా యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌పై రికార్డ్ అవ్వదని, బయటి స్క్రీన్ రికార్డర్లు లేదా ఇతర పరికరాల ద్వారా రికార్డ్ చేసి ఇక్కడకు తెచ్చి అప్‌లోడ్ చేస్తారని తెలిపింది. అందువల్ల, ఒక వీడియోలో కనిపిస్తున్నది కోర్టు కార్యకలాపాలా కాదా? దానికి ముందస్తు అనుమతి ఉందా లేదా? అది ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది? అనేది తమంతట తాముగా సిస్టమ్ ద్వారా కనిపెట్టడం ఇంపాజిబుల్ అని తేల్చి చెప్పింది. భారతదేశంలో ఒక్కో కోర్టుకు ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నాయని, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ముందస్తు నిఘా పెట్టలేమని స్పష్టం చేసింది.
గంటకు వేలాది వీడియోల అప్‌లోడ్
యూట్యూబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ఒక ఓపెన్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ ప్రతి గంటకు, ప్రతి నిమిషానికి వేలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఈ భారీ డేటాలో ఏ వీడియో కోర్టు అనుమతి లేకుండా రికార్డ్ చేయబడిందో వెతకడం మానవమాత్రంగాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్‌వేర్‌లకు గాని సాధ్యపడదని గూగుల్ వాదించింది. థర్డ్ పార్టీ యూజర్లు (యూట్యూబర్లు) అప్‌లోడ్ చేసే కంటెంట్ సరైనదా కాదా అని నిర్ణయించే బాధ్యతను భారతీయ చట్టాలు సోషల్ మీడియా కంపెనీలపై మోపలేదని గుర్తు చేసింది. ఒక కంటెంట్ చట్టవిరుద్ధమా కాదా అని నిర్ణయించే అధికారం కేవలం సమర్థుడైన న్యాయమూర్తికి లేదా కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది.
లింక్ ఇస్తేనే వీడియోలు తొలగిస్తాం
భారతదేశ ఐటీ నిబంధనల ప్రకారం తమ బాధ్యత ఎంతవరకు ఉందో గూగుల్ కోర్టుకు స్పష్టంగా వివరించింది. ఏదైనా వీడియో చట్టాన్ని ఉల్లంఘిస్తోందని గౌరవ కోర్టు నిర్ధారించి, దానికి సంబంధించిన నిర్దిష్ట వెబ్‌లింక్ (URL)ను తమకు అందిస్తే, ఆ వీడియోను ప్లాట్‌ఫారమ్ నుండి వెంటనే తొలగించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపింది. అంతేకానీ, ఎలాంటి లింకులు ఇవ్వకుండా, భవిష్యత్తులో వచ్చే అన్ని కోర్టు వీడియోలను బ్లాక్ చేయమనడం సమంజసం కాదని పేర్కొంది. అడ్వకేట్ వైభవ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా గూగుల్ ఈ వివరణ ఇచ్చింది.
అరవింద్ కేజ్రీవాల్ కోర్టు విచారణ వీడియోల వివాదం
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆప్ సుప్రీమో అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన విచారణ సందర్భంగా ఈ వివాదం మొదలైంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ కోర్టులో కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలు కోర్టు అనుమతి లేకుండానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది వైభవ్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలను దొంగచాటుగా రికార్డ్ చేసి వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి కోర్టు రికార్డింగులు యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ కాకుండా గూగుల్ వంటి కంపెనీలను ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పైనే విచారణ జరిపిన కోర్టు వివరణ కోరగా గూగుల్ పైవిధంగా స్పందించింది.