Government Bonds vs FD: 7% ప్రభుత్వ బాండ్లా లేక 7.5% ఎఫ్డీనా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి?
లాభాలు వస్తాయి?
Government Bonds vs FD: మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ దాచుకోవాలి, ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి నష్టభయం లేని సురక్షితమైన పెట్టుబడులను కోరుకునేవారికి ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ 7 శాతానికి పైగా చేరగా, కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికి వాటి మధ్య ఉన్న తేడాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం.
10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ పెరుగుదల
భారతదేశానికి చెందిన బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ ఇటీవల 7.10 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరల పెరుగుదల, రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ విధానాల కారణంగా ఈ బాండ్ల ఈల్డ్‌లో మార్పులు వస్తున్నాయి. అమెరికాలో లాంగ్ టర్మ్ బాండ్ల ఈల్డ్ పెరగడం కూడా భారతీయ బాండ్ మార్కెట్పై కొంత ప్రభావం చూపుతోంది. సాధారణంగా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు, ఎందుకంటే వీటికి ప్రభుత్వ భద్రత ఉంటుంది.
బ్యాంకు ఎఫ్‌డీలపై 6% నుంచి 7.5% వరకు వడ్డీ
మరోవైపు బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే, వివిధ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మారుస్తుంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ బ్యాంకులు రూ.3 కోట్ల కంటే తక్కువ జమలపై సుమారు 6.25% నుంచి 6.50% వరకు వడ్డీ ఇస్తుండగా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు సాధారణ ప్రజలకు 7.10% వరకు, సీనియర్ సిటిజెన్లకు 7.35% వరకు వడ్డీని అందిస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నప్పటికీ, ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడి పెట్టడం మంచిది.
బాండ్లు, ఎఫ్‌డీల మధ్య ప్రధాన తేడాలు
ఎఫ్‌డీలలో మనం ఎంతొక మొత్తాన్ని నిర్దిష్ట కాలానికి ఫిక్స్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మనకు వచ్చే మొత్తం ముందే స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ప్రభుత్వ బాండ్ల విషయంలో అలా ఉండదు. బాండ్లను మెచ్యూరిటీ వరకు ఉంచితే ఎలాంటి సమస్య ఉండదు కానీ, ఒకవేళ గడువు తీరకముందే మధ్యలో విక్రయించాలనుకుంటే మార్కెట్ వడ్డీ రేట్లను బట్టి వాటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. వడ్డీ రేట్లు పెరిగితే పాత బాండ్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో బాండ్లను అమ్మాలనుకునే వారికి మార్కెట్ రిస్క్ ఉండే అవకాశం ఉంది.
పెట్టుబడి పెట్టే ముందు ట్యాక్స్
ఏ పెట్టుబడి అయినా కేవలం వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయించకూడదు. బాండ్లు, ఎఫ్‌డీలు రెండింటిపై వచ్చే వడ్డీ ఆదాయానికి ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ట్యాక్స్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను పోను మన చేతికి ఎంత నికర లాభం వస్తుందో లెక్కగట్టాలి. మీకు ఎప్పుడు డబ్బు అవసరమవుతుంది, ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేయగలరు అనే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు ఎఫ్‌డీలను ఎంచుకోవడం మంచిది కాగా, దీర్ఘకాలికంగా సురక్షితమైన ఆదాయాన్ని కోరుకునేవారు ప్రభుత్వ బాండ్లను పరిశీలించవచ్చు.