LIC : ఎల్ఐసీలో కేంద్రం భారీ వాటా విక్రయం.. ఆ పాలసీదారులు, ఇన్వెస్టర్లపై పడే ప్రభావం ఇదే
ఇన్వెస్టర్లపై పడే ప్రభావం ఇదే
LIC : భారతదేశంలోనే అత్యంత అతిపెద్ద జీవిత భీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో కేంద్ర ప్రభుత్వం తమ వాటాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. కేంద్రం ఎల్ఐసీలో దాదాపు 6.5 శాతం వరకు వాటాను అమ్మకానికి పెట్టింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 31,410 కోట్లు సమకూరనున్నాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ నిబంధనల ప్రకారం.. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన ఏ కంపెనీలోనైనా కనీసం 25 శాతం వాటా సాధారణ ప్రజల వద్ద ఉండాలి. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రజల వాటా కేవలం 3.5 శాతంగానే ఉంది. సెబీ ఇచ్చిన మే 2027 గడువు లోపు ఈ నిబంధనను పాటించాల్సిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలో 2 శాతం, డిమాండ్‌ను బట్టి మరో 4.5 శాతం వాటాను అదనంగా విక్రయించాలని నిర్ణయించింది.
స్టాక్ ఇన్వెస్టర్లకు పండగే
షెల్ ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మారనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎల్ఐసీ షేరు ధర రూ. 428.50 వద్ద ముగియగా, ప్రభుత్వం దీని ఆఫర్ ఫర్ సేల్ ఫ్లోర్ ప్రైస్ ను రూ. 382 గా నిర్ణయించింది. అంటే ఇన్వెస్టర్లకు మార్కెట్ ధర కంటే ఏకంగా 11 శాతం తక్కువ ధరకే షేర్లు లభిస్తున్నాయి. అంతేకాకుండా సాధారణ రీటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులకు ముగింపు ధరపై అదనంగా మరో రూ. 15 డిస్కౌంట్ లభించనుంది. పెద్ద ఇన్వెస్టర్లకు ఆగస్టు 4న ఈ సేల్ ప్రారంభం కాగా, సాధారణ రీటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు ఆగస్టు 5న ఈ షేర్ల కోసం బిడ్డింగ్ వేసుకోవచ్చు.
పాలసీదారులకు బిగ్ రిలీఫ్
ఎల్ఐసీలో ప్రభుత్వం వాటాలు అమ్ముతుండటంతో దేశంలోని కోట్లాది మంది పాలసీదారుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే, పాలసీదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తమ వాటాలను విక్రయించడం అనేది కేవలం స్టాక్ మార్కెట్ నిబంధనలను నెరవేర్చడానికి మాత్రమే. దీనివల్ల మీ ఎల్ఐసీ పాలసీ పై కానీ, దానికి వచ్చే మెచ్యూరిటీ అమౌంట్, బోనస్‌లు లేదా ఇతర ప్రయోజనాలపై కానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. మీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ ఎప్పటిలాగే వర్తిస్తుంది. ఎల్ఐసీ భద్రతా నిబంధనలు, మీ హక్కులు ఏమాత్రం మారవు.