Fuel Crisis : పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కొనుగోళ్లపై లిమిట్ ఫిక్స్!
కొనుగోళ్లపై లిమిట్ ఫిక్స్!
Fuel Crisis : దేశంలో ఇంధన అమ్మకాలు, పంపిణీ వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల్లో మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిల్ (HSD) విక్రయాలపై కొన్ని కఠినమైన ఆంక్షలను విధించింది. ఈ కొత్త నిబంధనల వల్ల పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, భారీ వాహనాలు కలిగి ఉన్నవారిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నయా రూల్స్ తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కమర్షియల్ కస్టమర్లకు పెట్రోల్ బంకుల్లో నో ఎంట్రీ
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. పెద్ద పెద్ద కమర్షియల్ లేదా భారీ పారిశ్రామిక సంస్థలు ఇకపై సాధారణ ప్రజలు వాడే రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వీల్లేదు. వీరందరిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. ఇలాంటి కమర్షియల్ కస్టమర్లు తమ వాహన అవసరాల కోసం లేదా ఫ్యాక్టరీ అవసరాల కోసం ఇంధనం కావాలనుకుంటే.. కేవలం వారి స్వంత కన్జ్యూమర్ పంపుల ద్వారానే లీగల్‌గా ఇంధనాన్ని సేకరించుకోవాల్సి ఉంటుంది.
రోజువారీ డీజిల్ కోటా 200 లీటర్లు మాత్రమే
ఈ తాజా నోటిఫికేషన్‌లో ప్రభుత్వం మరో పెద్ద బాంబ్ పేల్చింది. పెట్రోల్ బంకుల డీలర్లు ఏ ఒక్క వాహనానికి లేదా కస్టమర్‌కు ఒక రోజులో 200 లీటర్ల కంటే ఎక్కువ హై-స్పీడ్ డీజిల్‌ను విక్రయించకూడదని కఠిన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా మనం వాడే కార్లు లేదా బైకుల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 200 లీటర్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, సాధారణ మధ్యతరగతి ప్రజల రోజువారీ జీవితంపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. కానీ పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు నడిపే వారికి, కమర్షియల్ పర్పస్ కోసం పెద్ద పెద్ద డ్రమ్ముల్లో డీజిల్ తీసుకెళ్లే వారికి ఇది పెద్ద ఇబ్బందిగా మారనుంది. అలాగే, బంకుల నుంచి కొనుగోలు చేసిన డీజిల్‌ను లాభాల కోసం బయట వేరే వ్యక్తులకు తిరిగి అమ్మడం (రీసేల్)పై కూడా ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది.
అసలు ఏంటి ఈ హై-స్పీడ్ డీజిల్ ?
మనం రోజువారీగా పెట్రోల్ బంకుల్లో కార్లు, బస్సులకు కొట్టించే సాధారణ డీజిల్‌నే టెక్నికల్ భాషలో హై-స్పీడ్ డీజిల్ అని పిలుస్తారు. ఇది పెట్రోలియం నుంచి తయారు చేయబడే అత్యంత నాణ్యమైన ప్రామాణిక ఇంధనం. 750 ఆర్‌పిఎమ్ కంటే ఎక్కువ వేగంతో నడిచే ఆధునిక ఆటోమొబైల్ ఇంజన్ల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. మన నిత్యజీవితంలో వాడే లగ్జరీ కార్లు, భారీ ట్రక్కులు, బస్సులు, కన్స్ట్రక్షన్ సైట్లలో వాడే పెద్ద పెద్ద క్రేన్లు, కరెంట్ పోయినప్పుడు వాడే పవర్ జనరేటర్లను నడపడానికి ఈ హై-స్పీడ్ డీజిల్‌నే ప్రాథమిక ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇవి కాకుండా వ్యవసాయ యంత్రాలు, గ్యాస్ టర్బైన్లు, పెట్రోలియం డ్రిల్లింగ్ భారీ పరికరాలలో కూడా దీని వాడకం ఎక్కువగా ఉంటుంది.
90 రోజుల పాటు అమల్లో ఉండనున్న కొత్త రూల్స్
ఇంధన విక్రయాల నియంత్రణ కోసం తీసుకొచ్చిన ఈ కొత్త కోటా సిస్టమ్ ప్రస్తుతం ప్రాథమికంగా 90 రోజుల కాలపరిమితి (3 నెలల పాటు) వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంటే రాబోయే మూడు నెలల పాటు దేశంలోని అన్ని పెట్రోల్ బంకులు ఈ కఠినమైన రూల్స్ పరిధిలోనే వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలో పరిస్థితులు చక్కబడితే, ఈ 90 రోజుల గడువు ముగియక ముందే సరికొత్త అధికారిక ఆదేశాల ద్వారా ఈ ఆంక్షలను ఎప్పుడైనా ఎత్తివేసే హక్కు ప్రభుత్వానికి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.