LIC : భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (LIC)లో వాటాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను కూడా చివరి నిమిషం వరకు దూరంగా ఉంచి ఏకంగా 3.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31,000 కోట్లు) సమీకరించింది. మన దేశంలో స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా జరిగిన అతిపెద్ద సెకండరీ ఆఫరింగ్‌గా ఇది రికార్డు సృష్టించింది. గతంలో ఊహించిన దానికి కంటే రెట్టింపు స్థాయిలో ఈ వాటాల విక్రయం జరగడం విశేషం.

చివరి క్షణం వరకు రహస్యంగా ఉంచిన మాస్టర్ ప్లాన్

ఈ మెగా డీల్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం పాటించిన అత్యంత గోప్యత. వాటాల విక్రయం ప్రారంభమయ్యే సమయం ముందే బయటకు తెలిస్తే, మార్కెట్ ట్రేడర్లు ముందుగానే పొజిషన్లు తీసుకుని ఎల్ఐసీ షేర్ల ధరను తక్కువ స్థాయికి పడిపోయేలా చేస్తారని ప్రభుత్వం భావించింది. అందుకే పెట్టుబడుల ఉపసంహరణ శాఖ అధికారులు అత్యంత రహస్యంగా వ్యూహాన్ని అమలు చేశారు. నాలుగు ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో ఒక బ్యాంకు ప్రతినిధికి కూడా సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి సమాచారం ఇచ్చే కొద్ది గంటల ముందు మాత్రమే సమాచారం ఇచ్చి ఢిల్లీకి పిలిపించారు.

పైసా ఖర్చు లేకుండా ఉచిత సేవలు అందించిన బ్యాంకర్లు

సాధారణంగా ఇలాంటి వేల కోట్ల విలువైన బిజినెస్ డీల్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు భారీ స్థాయిలో అడ్వైజరీ ఫీజులు వసూలు చేస్తారు. కానీ ఈ ఎల్ఐసీ ఆఫరింగ్‌లో బ్యాంకర్లకు రూపాయి కూడా ఫీజు చెల్లించలేదు. రెక్వెస్ట్-ఫర్-ప్రపోజల్ ప్రక్రియలో ఒక బ్యాంక్ రూపాయి ఫీజు లేకుండా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో, మిగిలిన బ్యాంకులు కూడా ఉచితంగా పనిచేయడానికి ఒప్పుకున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన పెద్ద పెద్ద ఆఫరింగ్స్‌లో లీగ్ టేబుల్ క్రెడిట్, మార్కెట్ గుర్తింపు, భవిష్యత్ అనుబంధాల కోసం బ్యాంకర్లు ఉచితంగా పనిచేసేందుకు పోటీపడతారు.

సరైన సమయంలో వ్యూహాత్మక డీల్ ప్రకటన

ఎల్ఐసీ తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం నాడు ప్రకటిస్తుందని మార్కెట్ వర్గాలు భావించాయి. అందువల్ల ఫలితాల తర్వాతే వాటాల విక్రయం ఉంటుందని అంతా లెక్కలేసుకున్నారు. అయితే ఇన్వెస్టర్లను, ట్రేడర్లను ఆశ్చర్యపరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఫలితాల కంటే ముందే ఈ డీల్‌ను ముందుకు తెచ్చింది. తొలుత 2.5 శాతం మూల వాటాను విక్రయించి, డిమాండ్ పెరిగితే అదనంగా మరో 4 శాతాన్ని విక్రయించేలా ప్రణాళిక రచించింది. బేస్ ఆఫర్ చిన్నదిగా ఉండటంతో పెద్ద ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు.

రికార్డు స్థాయిలో సబ్‌స్క్రిప్షన్

ప్రభుత్వం వేసిన ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. మంగళవారం నాటి సంస్థాగత పక్షంలో బేస్ పోర్షన్ ఏకంగా 3.32 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. దాంతో అదనపు వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. బుధవారంతో ముగిసిన రిటైల్ విభాగంలో 69 శాతం సబ్‌స్క్రిప్షన్ లభించింది. మొత్తంగా ఈ ఆఫరింగ్ 1.2 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. ఈ విక్రయంతో ఎల్ఐసీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10 శాతానికి చేరుకుంది. దీనివల్ల సెబీ విధించిన మే 2027 గడువు కంటే దాదాపు ఏడాదినర ముందే నిబంధనలను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.

Tags: