Gratuity Calculator: రూ.1 లక్ష జీతం ఉంటే 10 ఏళ్లకు ఎంత గ్రాట్యుటీ వస్తుందో తెలుసా?
| ఎంత గ్రాట్యుటీ వస్తుందో తెలుసా?
Gratuity Calculator: ప్రతి ఉద్యోగి జీవితంలో జీతంతో పాటు భవిష్యత్తును భద్రపరిచే అనేక అంశాలు ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైనది గ్రాట్యూటీ. ఎవరైనా ఉద్యోగి ఒకే సంస్థలో నిర్దిష్ట కాలం పాటు సేవలు అందించినప్పుడు, ఆ కంపెనీ కృతజ్ఞతగా లేదా ప్రోత్సాహకంగా అందించే ఆర్థిక లాభమే ఈ గ్రాట్యూటీ. రిటైర్మెంట్ సమయంలో లేక ఉద్యోగం మానేసేటప్పటికీ చేతికి అందే ఈ మొత్తం ఉద్యోగులకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఈ డబ్బు ఏ లెక్కన వస్తుంది, ఎంత కాలం పనిచేస్తే అర్హత లభిస్తుంది అనే విషయాలపై ప్రతి ఒక్కరికీ స్పష్టత ఉండటం చాలా అవసరం.
గ్రాట్యూటీకి అర్హత అలాగే కొత్త లేబర్ కోడ్ నిబంధనలు
సాధారణ నియమాల ప్రకారం ఏ ఉద్యోగైనప్పటికీ ఒకే కంపెనీలో కనీసం 5 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేస్తేనే గ్రాట్యూటీకి అర్హులవుతారు. అయితే ఒకవేళ ఉద్యోగం చేసే సమయంలో దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణించినా లేక అంగవైకల్యం సంభవించినా 5 సంవత్సరాల నిబంధన వర్తించదు. అలాంటి సందర్భాల్లో వెంటనే కుటుంబానికి లేదా ఉద్యోగికి మొత్తం అందుతుంది. ఇక కొత్త సోషల్ సెక్యూరిటీ కోడ్ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్‌కు కూడా ఈ ప్రయోజనం దక్కుతుంది. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత కూడా నిష్పత్తి ఆధారంగా గ్రాట్యూటీ పొందే అవకాశం కొత్త చట్టం కల్పిస్తోంది.
గ్రాట్యూటీ లెక్కించే సరళమైన ఫార్ములా ఇదే
గ్రాట్యూటీ మొత్తాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ఫార్ములాను రూపొందించింది. గ్రాట్యూటీ = (చివరి బేసిక్ జీతం అలాగే డీఏ × 15 × చేసిన సంవత్సరాలు) ÷ 26 అనే సూత్రం ఆధారంగా లెక్కలు వేస్తారు. ఇక్కడ 15 రోజులు జీతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. నెల రోజుల్లో 30 రోజులకు బదులుగా కేవలం 26 పని దినాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, మిగిలిన నాలుగు ఆదివారాలను మినహాయిస్తారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
రూ.లక్ష జీతం ఉంటే ఎంత వస్తుంది?
ఉదాహరణకు ఒక ఉద్యోగి చివరి బేసిక్ సాలరీ అలాగే డియర్నెస్ అలవెన్స్ కలిపి నెలకు రూ.1,00,000 అందుకుంటున్నార అనుకుందాం. అదే సంస్థలో వారు పదేళ్ల సేవలను పూర్తి చేశారు. అప్పుడు ఫార్ములా ప్రకారం (1,00,000 × 15 × 10) ÷ 26 వేస్తే వచ్చే మొత్తం సుమారు రూ.5,76,923 అవుతుంది. అంటే దాదాపు రూ.5.77 లక్షల గ్రాట్యూటీ రూపంలో లభిస్తాయి. అదే జీతం రూ.50,000 ఉంటే పదేళ్లకు సుమారు రూ.2,88,462 వరకు అందుతాయి. ఈజీ ఫార్ములాతో ఎవరైనా తమ గ్రాట్యూటీ మొత్తాన్ని సులభంగా అంచనా వేసుకోవచ్చు.